
నేడు కోదాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు
కోదాడరూరల్ : కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నిక దాదాపుగా ఏకగ్రీవమైనట్లే. అధ్యక్ష పదవికి న్యాయవాదులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, నాళం రాజయ్యలు పోటీపడుతున్నారు. అయితే బార్ అసోసియేషన్ క్షేమం కోరి సీనియర్‌ల సలహా మేరకు నాళం రాజయ్య పోటీ నుంచి విరమించుకొని లక్ష్మీనారాయణరెడ్డికే మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బార్ కౌన్సిల్ నియమావళి ప్రకారం ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ రాజ య్య పోటీనుంచి తప్పుకోవడంతో లక్ష్మీనారాయణరెడ్డి ఎన్నిక దాదాపుగా ఖరారు అయింది. శుక్రవారం అధ్యక్ష పదవితో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్ 4వ స్థానానికి ఎన్నికను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి పాలేటి నాగేశ్వరరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు పోలింగ్ ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో 104 మంది న్యాయవాదులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు నాగేశ్వరరావుతో పాటు సహాయ అధి కారులు వెంకటేశ్వర్లు, రామకృష్ణ తెలిపారు.
ఉపాధి పనులను వాటర్ షెడ్ పద్ధతిలో గుర్తించాలి
భానుపురి (సూర్యాపేట) : యుక్తధార పోర్టల్ ద్వారా ఉపాధి హామీ పనులను వాటర్ షెడ్ పద్ధతిలో గుర్తించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్లకు యుక్త ధార శిక్షణ తరగతుల్లో డీఆర్‌డీఓ వీవీ అప్పారావుతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీలో వాటర్ షెడ్ పద్ధతిలో ఎత్తు పల్లాల నుంచి దిగువపల్లం వరకు సంబంధించిన పనులను పోర్టల్‌లో గుర్తించాలన్నారు.
సాగర్ కాల్వలకు నీటి నిలిపివేత
నాగార్జునసాగర్: సాగర్ కుడి, ఎడమ కాల్వలకు గురువారం సాయంత్రం నీటిని నిలిపి వేశారు. యాసంగి పంటకుగాను అధికారులు గత సంవత్సరం డిసెంబర్ 15 నుంచి ఆయకట్టుకు ఏకధాటిగా నీటిని విడుదల చేశారు. కుడికాల్వ కింద ఏపీలో 10.50 లక్షల ఎకరాలు సాగైంది. ఎడమకాల్వ కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,98,790 ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,63,736 ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్‌లో 115 రోజులపాటు కుడి కాల్వకు 100టీఎంసీలు, ఎడమ కాల్వకు 74టీఎంసీల నీటిని విడుదల చేశారు.
విద్యుత్‌లైన్ పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి
హుజూర్‌నగర్‌రూరల్ : విద్యుత్ లైన్ పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ప్రాంక్లిన్ సిబ్బందిని ఆదేశించారు. హుజూర్‌నగర్ మండలంలోని వేపలసింగారంలో మంగళవారం అర్ధరాత్రి వీచిన ఈదురుగాలులకు సబ్‌స్టేషన్‌కి వచ్చే 33 కేవీ లైన్ విద్యుత్ స్తంభాలు ఎనిమిది విరిగిపోయాయి. కాగా గురువారం డీఈ వెంకటస్వామితో కలిసి విద్యుత్ లైన్ పునరుద్ధరణ పనులను పరిశీలించి మాట్లాడారు. వీరి వెంట ఏఈ రాంప్రసాద్, సిబ్బంది తదితరులు ఉన్నారు.