ఎస్సీ రిజర్వేషన్‌ పెంచుతాం | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ రిజర్వేషన్‌ పెంచుతాం

Mar 17 2025 10:44 AM | Updated on Mar 17 2025 10:37 AM

తుంగతుర్తి: ఎస్సీ రిజర్వేషన్‌ శాతం పెంపునకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2026లో నిర్వహించనున్న జనాభా లెక్కల ప్రకారం కచ్చితంగా పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాలు, నీరుపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కాంగ్రెస్‌స్‌ పార్టీ కృతజ్ఞత సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి హాజరై మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణే అని స్పష్టం చేశారు. చట్ట సభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

బడ్జెట్‌ సమావేశాల్లో మూడు కీలక బిల్లులు

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు. మొదటి బిల్లు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌, రెండో బిల్లు స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్‌, మూడో బిల్లు ఎస్సీల్లోని 15శాతం రిజర్వేషన్లను 59 ఎస్సీ ఉపకులాలకు పంచేలా ఉపకోటా నిర్ణయిస్తామన్నారు. ఈనెల 17న ఎస్సీ ఉప వర్గీకరణ బిల్లుపై, 18న బీసీ రిజర్వేషన్‌, కుల సర్వే అంశంపై ప్రభుత్వం చర్చలు జరపనుందన్నారు. నా నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని, న్యాయమూర్తి షమీమ్‌ అఖ్తర్‌ నేతృత్వంలోని ఏకసభ్య కమిషనన్‌ను నియమించడం ఇందుకు నిదర్శనమని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులందరి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం న్యాయ కమిషన్‌ నివేదిక ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తోందని తెలిపారు. 1931 తర్వాత తెలంగాణలో మొదటిసారిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి స్థాయి కుల ఆధారితంగా సామాజిక–ఆర్థిక సర్వే నిర్వహించిందని వివరించారు.

తుంగతుర్తి అభివృద్ధికి కృషి

తుంగతుర్తి తన స్వస్థలమని, ఈ ప్రాంతాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని మంత్రి ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, తుంగతుర్తికి ఎస్సారెస్పీ ఫేజ్‌–2, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామనానరు. అంతేకాకుండా తుంగతుర్తికి గోదావరి, మూసీ నదుల నీటిని తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం సభలో మంత్రలకు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు గొర్రె పిల్లలు, గొంగళ్లు, డప్పులను బహూకరించి సన్మానించారు. ఈ సభలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేలు, వేముల వీరేషం, లక్ష్మీకాంత్‌, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్‌ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్‌, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ కిషన్‌రావు టీపీసీసీ సభ్యుడు గుడిపాటి నర్సయ్య, కడియం పరమేశ్వర్‌, గుడిపాటి సైదులు, దొంగరి గోవర్ధన్‌, గిరిధర్‌రెడ్డి, చింతకుంట్ల వెంకన్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ఫ జనాభా దామాషా ప్రకారం

బీసీలకు రిజర్వేషన్లు

ఫ రాష్ట్ర నీరుపారుదల శాఖ మంత్రి

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఫ తుంగతుర్తిలో కాంగ్రెస్‌ కృతజ్ఞత

బహిరంగ సభ

ఫ హాజరైన ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి

మంత్రి తుమ్మల తదితరులు

ఎస్సీ రిజర్వేషన్‌ పెంచుతాం1
1/1

ఎస్సీ రిజర్వేషన్‌ పెంచుతాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement