ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి
సూర్యాపేట : అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని, ఆరోపణలు కాకుండా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సోమవారం సూర్యాపేటలో జరిగిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు ప్రభుత్వాలూ అన్యాయం చేశాయని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు ఇంకా రూ.42వేల కోట్లు కేటాయించాల్సి ఉందన్నారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు.. భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీ కూడా అమలు కాలేదన్నారు. పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబి జీరాంజి పేరు పెట్టడం మహాత్ముడిని అవమానించడమేనని అన్నారు. గ్రామాలలో యూరియా కొరత ఉందని, ప్రభుత్వం తక్షణమే రైతాంగానికి కావాల్సిన యూరియాను అందుబాటులో ఉంచాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను నొక్కుతూ అప్రజా స్వామిక పరిపాలన కొనసాగిస్తోందన్నారు.ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేస్తున్న మతోన్మాద చర్యలను ప్రశ్నించిన వారిపై దాడులు, అక్రమ కేసులు, ఎన్‌కౌంటర్ల ద్వారా అణిచివేస్తోందన్నారు. ఇటీవల సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఏ అధికారులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, కొలిశెట్టి యాదగిరిరావు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ములకలపల్లి రాములు, నాగారపు పాండు, పారేపల్లి శేఖర్ రావు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి,, మేదరమెట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
‘పాలమూరు –రంగారెడ్డి’కి రెండు ప్రభుత్వాలూ అన్యాయం చేశాయి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ


