సత్వరమే అర్జీలు పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజా వాణి ఫిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. వివిధ శాఖల్లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించాలన్నారు. జిల్లాలో ప్రైవేటు భవనాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల వివరాలను సమర్పించాలన్నారు. ఈ భవనాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మార్చుకోవాలని, లేదంటే 2026జనవరి 1 నుంచి ఆయా కార్యాలయాలకు అద్దె చెల్లింపులు నిలిపివేస్తారని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, ఆర్డీఓ వేణు మాధవ్, జిల్లా అధికారులు సతీష్, కె.నర్సింహారావు, సిద్ధార్థ, శిరీష, దయానంద రాణి, కిషన్ నాయక్, అశోక్, భానునాయక్, వెంకట రమణ పాల్గొన్నారు.
యూరియా కొరత లేదు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో రబీ సీజన్లో యూరియా పంపిణీ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈకాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ .. జిల్లాలో యూరియా పంపిణీ పై అధికారులతో సమీక్షించారు. 2025 యాసంగిలో జిల్లాలో ప్రస్తుతం 10,508 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేసేందుకు వివిధ సొసైటీలు, డీలర్లు,ఎన్‌డీసీఎం ఎస్, ఏ ఆర్ ఎస్ కే, మార్క్‌ఫెడ్ గోదాములలో అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. కాగా, ఇప్పటివరకు జిల్లాలో ఈ సీజన్ లో రైతులకు 32,910 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 544 సెంటర్ల ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వర్ శర్మ, జిల్లా సహకార అధికారి ప్రవీణ్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగయ్య, జిల్లా ఉద్యాన శాఖ డీడీ కె .సుభాషిణి పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


