కొత్త సంవత్సర వేడుకల్లో ఆంక్షలను అతిక్రమిస్తే చర్యలు
సూర్యాపేటటౌన్ : నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్పీ నరసింహ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రతీ వాహనాదారుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో సాయంత్రం 6 గంటల నుంచి వాహనాల తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ఉంటాయని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించొద్దని సూచించారు. ఫామ్ హౌస్, క్లబ్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లో అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించొద్దని కోరారు. ప్రజలను భయాందోళనకు గురి చేసేలా క్రాకర్స్, అత్యధిక మొతాదులో గల సౌండ్ సిస్టమ్ (డీజే) ఏర్పాటు చేయొద్దని, వాహనం నడుపుతూ మైనర్లు పట్టుబడితే మైనరుపై, వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. త్రిబుల్ రైడింగ్ చేయొద్దని, పెద్ద శబ్దాలు చేసే సైలెన్సర్లతో వాహనాలు నడిపితే.. ఆ వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. గుంపులు గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం, వాహనాలతో ర్యాలీగా వెళ్లడం చేయొద్దని సూచించారు. రోడ్లపై కేక్ కటింగ్ లాంటివి చేయొద్దని, ఇంట్లో ఉండి కుటుంబ సభ్యులతో సంతోషంగా వేడుకలు నిర్వహించుకోవడం మంచిదని కోరారు.
చైనా మాంజా ఉపయోగించొద్దు
గాలిపటాలు ఎగురవేయడానికి చైనా మాంజా ఉపయోగించవద్దని ఎస్పీ నరసింహ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. చైనా మాంజా (నైలాన్/సింథటిక్ దారం) విక్రయించడం, నిల్వ చేయడం, వాడటంపై ప్రభుత్వం నిషేధం విధించిందని, పర్యావరణానికి, పక్షులకు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న ఈ ప్రమాదకరమైన మాంజాను విక్రయించడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఈ దారం గాలిపటాలు ఎగురవేసే సమయంలో మెడకు లేదా శరీర భాగాలకు తగిలితే తీవ్రమైన గాయాలు కావడమే కాకుండా ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఫ్యాన్సీ షాపులు, గాలిపటాల విక్రయ కేంద్రాలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని, ఎక్కడైనా నిషేధిత చైనా మాంజా కనిపిస్తే వెంటనే వాటిని సీజ్ చేయడమే కాకుండా సంబంధిత విక్రేతలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రహస్యంగా చైనా మాంజా విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డైల్ 100 కు సమాచారం అందించాలని ప్రజలను ఆయన కోరారు.
ఎస్పీ నరసింహ


