విద్యకు ఊతం
నీళ్లకు నిధులు...
భానుపురి (సూర్యాపేట) : జిల్లా అన్ని రంగాల్లోనూ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. 2025 సంత్సరం.. జిల్లాలకు కలిసొచ్చింది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల, విద్యతో పాటు పలు రంగాలకు భారీగా నిధులు మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లకాలంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి నిధుల వరద పారించారు. ఎత్తిపోతల పథకాలతో పాటు వ్యవసాయ, ఉద్యాన కళాశాలలు, నవోదయ, రెండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయి. ఇక రాజధాని నుంచి హైదరాబాద్ – విజయవాడ హైవే ఆరులేన్ల పనులకు ఈ ఏడాదే మోక్షం లభించింది.
నియోజకవర్గానికి రూ.5 కోట్ల చొప్పున..
ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి రూ.5 కోట్ల చొప్పున నిధులను విడుదల చేసింది. ఈ నిధులు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గాను సూర్యాపేట మినహా మూడు నియోజకవర్గాలకు వచ్చాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనులు చేయాల్సి ఉంది. ఇందులో పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధులతో కోదాడ, తుంగతుర్తి, హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పలు సమస్యలు పరిష్కారం అయ్యాయి.
ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణకు..
పాలేరు జలాలను ఎత్తిపోసి ఎస్సారెస్పీ 24 కెనాల్, 36 కెనాల్‌లతో ఎస్సారెస్పీ ఆయకట్టును స్థిరీకరించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు గాను రూ.244 కోట్లను ఈ ఏడాదే విడుదల చేసింది. దీంతో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు ఢోకా లేకుండా సాగునీరు అందుతుంది. ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. అలాగే కోదాడ నియోజకవర్గ పరిధిలో రెడ్లకుంట లిఫ్ట్‌కు రూ.25 కోట్లు, శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు మరో రూ.50 కోట్లను ప్రభుత్వం ఈ ఏడాది నిధులను మంజూరు చేసింది. హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలో దాదాపు ఐదారు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సైతం చింతలపాలెం, పాలకవీడు, మఠంపల్లి మండలాల్లో సుమారుగా రూ.250 కోట్ల నిధులు వచ్చాయి.
సీఎం చేతుల మీదుగా..
రెండు సంక్షేమ పథకాలు జిల్లా నుంచే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి పేదలకు సన్నబియ్యం పథకాన్ని హుజూర్‌నగర్ నుంచే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. జూలై 14న తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డులను సీఎం చేతుల మీదుగా పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 24 వేల మందికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారు.
విద్యకు అధిక ప్రాధాన్యం..
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 2025లో విద్యకు అధిక ప్రాధాన్యత దక్కింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి నవోదయ స్కూల్ మంజూరు కాగా.. కోదాడ పరిధిలోని బాలాజీనగర్‌లో రూ.34 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. చిలుకూరు, గరిడేపల్లి మండలాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఒక్కొక్కటి రూ.200 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఒక్కో పాఠశాలలో 2,500 మందికి వసతితో కూడిన నాణ్యమైన విద్యను అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. గరిడేపల్లి మండలంలో హార్టికల్చర్ కొండాలక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీకి అనుబంధంగా 40 సీట్లతో హార్టికల్చర్ కళాశాల మంజూరైంది. హుజూర్‌నగర్ శివారులో రూ.100 కోట్లతో వ్యవసాయ కళాశాల, అడ్వాన్స్‌డ్‌ట్రైనింగ్ సెంటర్‌ను టాటా కంపెనీతో కలిసి ప్రారంభించారు.
కోదాడలో వంద పడకల ఆస్పత్రి
కోదాడ పట్టణంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని రూ.26 కోట్లతో వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు.అలాగే 3.5 కోట్లతో సిటీ స్కానింగ్ మిషన్ కూడా రోగుల అవసరం నిమిత్తం సమకూర్చారు. హుజూర్‌నగర్‌లోని ఏరియా ఆస్పత్రిలో నూతన ఓపీ బ్లాక్ నిర్మాణంతో పాటు పాత ఓపీ బ్లాక్ మరమ్మతులకు రూ.3.60కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.కోటితో ఈ ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్, రూ.3కోట్లతో సీటీ స్కాన్ సెంటర్‌ను ప్రారంభించారు.
ఇందిరమ్మ ఇళ్లతో నెరవేరిన కల..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలం తర్వాత పేదలకు సొంతింటి కల నెరవేరింది. ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలను దశలవారీగా ఇస్తూ పథకాన్ని ప్రారంభించగా.. వివిధ దశల్లో జిల్లావ్యాప్తంగా 4వేల ఇళ్లు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
మోతె లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు
రూ.244 కోట్లు
హుజూర్‌నగర్‌లో వ్యవసాయ కళాశాల
కోదాడలో నవోదయ.. గరిడేపల్లి, చిలుకూరు మండలాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు
రూ.300 కోట్ల నిధులు
ప్రత్యేక అభివృద్ధి నిధులే కాకుండా ఇతర నిధుల విషయంలోనూ సూర్యాపేట నియోజకవర్గం చిన్నబోయింది. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో లింక్ రోడ్లను తారురోడ్లుగా, మండల కేంద్రం నుంచి జిల్లాకేంద్రానికి డబుల్ రోడ్లుగా మార్చే ప్రక్రియ ఈ ఏడాది మరింత ముందుకు సాగింది. ఈ క్రమంలో ఒక్క హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోనే రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల నిధుల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాకేంద్రంతో పాటు నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో పెద్దగా నిధులు రావడం లేదని, ఈ ప్రాంత అభివృద్ధికి సైతం పాలకులు పాటుపడాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.
విద్యకు ఊతం
విద్యకు ఊతం
విద్యకు ఊతం


