మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని మట్టపల్లి వద్ద కృష్ణానదీ తీరంలో గల స్వయంభూ శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు వేసవి తాపం నుంచి బయట పడేందుకు ఆలయ పాలక వర్గం చలువ పందిర్లు ఏర్పాటు చేస్తోంది. ప్రధాన రాజగోపురం నుంచి ఆలయ సింహద్వారం వరకు, క్యూలైన్ల నుంచి ముఖమండపం వరకు మంగళవారం చలువ పందిర్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టారు. కృష్ణానదీతీరం నాపరాయితో నిక్షిప్తమై ఉండడంతో ఇక్కడ కాస్త వేడి ఎక్కువగానే ఉంటుంది. నదిలో నీరు తగ్గిపోతుండటంతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇందులోకి దిగేందుకు భక్తులు ఆసక్తి చూపడంలేదు. దీంతో పైభాగంలోనే వాటర్‌షవర్‌లు ఏర్పాటు చేశారు.
భక్తులకు ఇబ్బందులు
కలగకుండా ఏర్పాట్లు చేశాం
వేసవిలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆల య పరిసరాల్లో చలువ పందిర్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ అనుశంవశిక ధర్మకర్తలు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్ తెలిపారు.
మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో విశేష పూజలు చేశారు. ఇందులో భాగంగా సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. కల్యాణతంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం ,రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో ఘనంగా నిర్వహించారు. శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు.


