వలస.. ఇదీ వరుస
ఆమదాలవలస రూరల్: ఆమదాలవలస పురపాలక సంఘానికి సంబంధించి వైఎస్సార్ సీపీ గెలుపు జెండా ఎగరవేయడం దాదాపు ఖాయమని అన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా రాజకీయ కురు వృద్ధుడి కుటుంబం నుంచి బొడ్డేపల్లి అంతాకుమారి చైర్‌పర్సన్‌గా బరిలో ఉండటంతో కొంత అనుకూలత ఉందని పుర ప్రజలు భావిస్తున్నారు. కూటమి నాయకులు పలు కుట్రలు పన్నినా ఫలించలేదని చెప్పక తప్పదు. పురపాలక సంఘ పరిధిలో సుమారు ఐదు వార్డుల్లో ఎమ్మెల్యే కూన రవికుమార్ తిష్ట వేసినా వారి పప్పులు వైఎస్సార్ సీపీ నాయకుల ముందు ఉడకలేదు. అమ్మానగర్, అక్కివలస, పాతినివానిపేట, చిన్ని క్రిష్ణానగర్, గాంధీనగర్, చింతాడ, నందగిరిపేట తదితర వార్డుల్లో టీడీపీ రిగ్గింగ్ చేసేందుకు బయట ప్రాంతాల నుంచి రౌడీ మూకలను తెచ్చినా కూటమి నాయకుల పథకం ఫలించలేదు. ముందు నుంచీ ఈ పట్టణంలో బొడ్డేపల్లి కుటుంబానికి పేరు ఉండటంతో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి అధిక సంఖ్యలో ఓట్లు వేశారని కొందరు చెబుతున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
పుర పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు జరిగే లోపు రాజకీయ లెక్కలు మొదల య్యాయి. పోలింగ్ అనంతరం ప్రధాన పార్టీ ల నాయకుల్లో గెలుపుపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. ఎవరి అంచనాలు వారివి. ఎవరి ధీమా వారిదే. ఓటరు నాడి పట్టేశామని ఒకరు చెబుతుంటే, తమ లెక్కలు సరిగా కుదిరాయని మరొకరు భావిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో జరిగిన ఓటింగ్ సరళి మాత్రం నాయకుల అంచనాలకు అందని విధంగా ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశం ఉందనే విశ్లేషణ బాగా వినిపిస్తోంది. అప్పుడు 50 వేలకు పైగా మెజార్టీ కూటమికి రాగా.. ఇప్పటి లెక్కలు మాత్రం వారికి షాక్ ఇస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో ఏదో మాయాజాలం జరిగిందని ఇప్పటికే మేధావి వర్గాలు, సీనియర్ జర్నలిస్టులు బయటపెడుతున్న విషయం తెలిసిందే. కానీ అధికార పార్టీ మా త్రం అవన్నీ తమ ఘనతే అని చెప్పుకుని, కార్పొరేషన్ ఎన్నికల్లో అంత కాకపోయినా కొంతైనా వస్తాయని ధీమాతో ఉంది. కూటమిలో నెలకొన్న అనిశ్చితి, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మధ్య జరిగిన పోలింగ్ సరళి చూస్తుంటే అంచనాలకు మించి ఫలితం వచ్చే అవకాశం కనబడుతోంది.
క్రాస్ జరిగిందా..?
ఈ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం కూటమి నాయకుల్ని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. దీనిపై రకరకాల లెక్కలేసుకుంటున్నా.. ఎక్కడో తేడా కొట్టినట్టు ఉందని కూటమి నేతల్లో గుబులు మొదలైంది. పోలీసులను వాడుకున్నా.. బయట నాయకులు వచ్చి హల్‌చల్ చేసినా, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు వందలాది మంది వైఎస్సార్‌సీపీ నాయకులను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేసినా పరిస్థితి అంతా అనుకూలించేలా లేదనే అభిప్రా యం వారిలో ఉంది. ప్రజల్లో మార్పు వచ్చిందని, గత ఎన్నికల ఫలితాలు మాదిరిగా వచ్చే అవకాశం కనబడటం లేదని గుసగుసలాడుకుంటున్నారు.
నది అవతల గ్రామాలపై కూటమి ఆశలు
ఏటి (నాగావళి నది) అవతలి గ్రామాల్లో తమకు అనుకూలంగా ఓటింగ్ జరిగిందని కూటమి నాయకులు అంచనా వేసుకుంటున్నారు. కుశాలపురం, సీపన్నాయుడుపేట, పీఎన్ కాలనీ, హయాతినగరం, ఫాజుల్‌బాగ్‌పేట, గుజరాతిపేట తదితర ప్రాంతాల్లో వచ్చిన మద్దతు కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు బలం చేకూరుస్తుందని లెక్కలు వేస్తున్నారు. కొన్ని డివిజన్లలో ఓటింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందని భావిస్తూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇవతలివన్నీ వైఎస్సార్ సీపీవే..
ఏటి ఇవతలి గ్రామాలు, తమకు పట్టు ఉన్న ప్రాంతాల్లో భారీగా ఓట్లు పడ్డాయని వైఎస్సార్‌సీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. పలు ప్రాంతాల్లో మేయర్ అభ్యర్థికి గంపగుత్తగా ఓట్లు పడ్డాయని విశ్లేషించుకుంటున్నారు. నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని, కొన్నిచోట్ల క్రాస్ ఓటింగ్ కూడా తమకు కలిసి వస్తుందని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. కూటమి నాయకులు వేసుకుంటున్న లెక్కలకు భిన్నంగా ఫలితాలు వస్తాయని వైఎస్సార్‌సీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
మేయర్ పీఠమే అసలు పందెం
డివిజన్ల ఫలితాలు కంటే శ్రీకాకుళం మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్నదే ఇప్పుడు రాజకీయ పార్టీలకు ప్రధాన అంశంగా మారింది. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి? ఏ డివిజన్లు కీలకంగా మారుతాయి? అనూహ్య ఫలితాలు రాజకీయ సమీకరణాలను మారుస్తాయా? అన్న ప్రశ్నలు నాయకుల్లో ఉత్కంఠ పెంచుతున్నాయి. మేయర్ పీఠం కోసం రెండు పార్టీలూ తమ తమ బలాబలాలను బేరీజు వేసుకుంటున్నాయి.
కుశాలపురం తీర్మానాలు ఏమయ్యాయి..?
కార్పొరేషన్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కుశాలపురం గ్రామస్తులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. కార్పొరేషన్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. కార్పొరేటర్ స్థానానికి నామినేషన్ వేసిన 13మంది అభ్యర్థులను పార్టీలకు అతీతంగా ఒత్తిడి చేసి, విత్ డ్రా చేయించారు. ఎన్నికలకు దూరంగా ఉంటామని, ప్రభుత్వానికి తమ వాదన తెలియజేస్తామన్నారు. కానీ పోలింగ్‌కు ముందు రోజు రాత్రి ఏం జరిగిందో గానీ పోలింగ్ రోజున ఓటేసేందుకు ముందుకొచ్చారు. దీంతో ఇన్నాళ్లూ చేసిన ఆందోళనలకు విలువ లేకుండా పోయింది.
పోలింగ్ సరళిపై రాజకీయ పార్టీల విశ్లేషణలు
శ్రీకాకుళంలో మేయర్ స్థానంపైనే ఉత్కంఠ
ఏటి అవతలి గ్రామాలపై కూటమి ఆశలు
ఏటి ఇవతలి గ్రామాలపై వైఎస్సార్ సీపీ ధీమా
తుస్సుమన్న కుశాలపురం ఉద్యమం
ఆమదాలవలసలో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం
కుశాలపురం పోలింగ్ కేంద్రంలో జేసీ పరిశీలన


