● 275 సర్పంచ్ స్థానాలకు డిసెంబర్ 2న పోలింగ్
● అదనపు జిల్లా ఎన్నికల అధికారి స్వరూపారాణి
అరసవల్లి: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడతలో శ్రీకాకుళం, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో పంచాయతీలతో పాటు పలాస మండలం లొద్దభద్ర పంచాయతీతో కలుపుకుని మొత్తం 325 గ్రామ పంచాయతీలు, 3,066 వార్డు స్థానాల్లో ఎన్నికలకు సన్నాహాలు చేయగా.. ఇందులో 49 గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల స్థానాలు, 1,214 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని జిల్లా పంచాయతీ అధికారి, అదనపు జిల్లా ఎన్నికల అధికారి స్వరూపారాణి ప్రకటించారు. దీంతో డిసెంబర్ 2న జరగనున్న ఈ మూడో విడత ఎన్నికల్లో ఏకగ్రీవాలు మినహా 275 గ్రామ పంచాయతీలు, 1,848 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతుందన్నారు. కోటబొమ్మాళి మండలంలో దంత గ్రామ సర్పంచ్ స్థానానికి నామినేషన్ పడలేదని, అలాగే సంతబొమ్మాళి మండలం యామాలపేట పంచాయతీలో నాలుగు గ్రామ వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని, దీంతో ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని ఆమె వివరించారు. ఇక సర్పంచ్ స్థానాలకు 696 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 3,911 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. కాగా శ్రీకాకుళం మండలంలో 3 పంచాయతీలు, 59 వార్డులు, గారలో 1 పంచాయతీ, 83 వార్డులు, నరసన్నపేటలో 2 పంచాయతీలు, 99 వార్డులు, పోలాకిలో 4 పంచాయతీలు, 142 వార్డులు, జలుమూరులో 2 పంచాయతీలు, 72 వార్డులు, సారవకోటలో 2 పంచాయతీలు, 73 వార్డులు, టెక్కలిలో 6 పంచాయతీలు, 143 వార్డులు, నందిగాం 11 పంచాయతీలు, 191 వార్డులు, కోటబొమ్మాళిలో 11 పంచాయతీలు, 157 వార్డులు, సంతబొమ్మాళిలో 7 పంచాయతీలు, 195 వార్డులు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు.


