● ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో
పల్లెపోరు
●173 పంచాయతీలు, 1033 వార్డుల్లో ఎన్నికలు
● నేటి సాయంత్రమే ఫలితాల వెల్లడి
అరసవల్లి: మరికొద్ది గంటల్లో తొలి విడత గ్రామ పంచాయతీల్లో పోలింగ్ మొదలుకానుంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగనున్న ఈ ప్రక్రియకు సర్వం సిద్దమైంది. జిల్లాలో తొలివిడతలో ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాల్లో 194 గ్రామ పంచాయతీలకు 1922 వార్డుల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాగా..ఇందులో 21 పంచాయతీలు, 889 వార్డులు ఏకగ్రీవం కావడంతో పాటు మూడు వార్డులకు నో నామినేషన్‌గా గుర్తించారు. గురువారం మొత్తం 173 పంచాయతీలు, 1033 వార్డులకు పోలింగ్ జరగనుందని జిల్లా అదనపు ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి గురువారం ప్రకటించారు.
మధ్యాహ్నం 2 నుంచి లెక్కింపు...
ఇచ్ఛాపురంలో 16, కవిటిలో 19, వజ్రపుకొత్తూరు లో 31, మందసలో 39, పలాసలో 16, కంచిలిలో 31, సోంపేటలో 23 పంచాయతీల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొత్తం 1393 పోలింగ్ స్టేషన్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. 3,61,420 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో మహిళలే అధికంగా 1,84,627 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఓటర్లు రెండు బ్యాలెట్ ఓట్లు వేయాల్సి ఉంటుంది. పింక్ బ్యాలెట్ సర్పంచ్ స్థానానికి, తెలుపు బ్యాలెట్ వార్డు స్థానానికి కేటాయించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టనున్నారు. అనంతరం వీలైనంత త్వరగా ఫలితాలను వెల్లడిస్తామని స్వరూపారాణి ప్రకటించారు.


