● అధికారులకు కూటమి నాయకుల హెచ్చరిక
ఆమదాలవలస రూరల్ : పురపాలక ఎన్నికలకు సంబంధించి అధికార టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి ప్రమీల చైర్‌పర్సన్ అభ్యర్థి గా బరిలో ఉండటంతో ఆయన అధికార బలం వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ నుంచి బొడ్డేపల్లి కుటుంబ వారసురాలు బొడ్డేపల్లి అజంతాకుమారి బరిలో ఉన్నారు. అయితే ఎమ్మెల్యే సతీమణి బరిలో ఉండటంతో ఎలాగైనా గెలవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో అధికారులు తమ పార్టీకి అనుకూలంగా పనిచేయాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.
పాతటెక్కలిలో టీడీపీ
బెదిరింపుల పర్వం
వజ్రపుకొత్తూరు: పాతటెక్కలి పంచాయతీలో టీడీపీ నేతలు బెదిరింపులకు తెరతీశారు. తన అనుచరులను తెలుగుదేశం నాయకులు భయపెడుతున్నట్లు వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి తుంగాన సుశీల ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లను కేంద్రం లోపలికి రానివ్వబోమని బెదిరిస్తున్నారని వాపోయారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేద న్నారు. ఎన్నికల అధికారులు స్పందించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
సారవకోట : అవలింగి పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కొందరు అభ్యర్థులు ఓటర్లకు బియ్యం ప్యాకెట్లను ఎరగా వేస్తున్నారు. చాలాచోట్ల డబ్బులు, మద్యం ఎరగా వేస్తుంటే ఇక్కడ మాత్రం ఎప్పుడు ఎన్నికలు జరిగినా బియ్యం బస్తాలు పంపిణీ చేస్తుండటం గమనార్హం. ఇప్పటికే ఇంటింటికీ 26 కేజీలు చొప్పున బియ్యం బస్తాలు పంపిణీ చేసినట్లు గుసగుసలాడుకుంటున్నారు.


