ఆమదాలవలస: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు బుధవారం సంబంధిత అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. సంక్రాంతి పండగ ముగించుకొని వెళ్లే ప్రయాణికులకు శ్రీకాకుళం రైల్వేస్టేషన్ నుంచి శ్రీకాకుళం రోడ్డు – చర్లపల్లి ప్రత్యేక రైలు ఇక్కడ నుంచే నడవనున్నది. ఈ రైలు చర్లపల్లిలో రాత్రి 7:40లకు బయల్దేరి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వా డ, పెందుర్తి, విజయనగరం, చీపురుపల్లి మీదుగా శ్రీకాకుళం రోడ్‌కు మధ్యాహ్నం 12:30 నిమిషాలకు చేరుకుంటుంది. ఈ రైలు చర్లపల్లి నుంచి జనవరి 7, 9, 16 తేదీల్లో వస్తుందని, తిరుగు ప్రయాణం జనవరి 8, 10, 17 తేదీల్లో శ్రీకాకుళం రోడ్ నుంచి మధ్యాహ్నం 2:30లకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:30కి చర్లపల్లి చేరుకుంటుందని తెలిపారు.


