టెక్కలి రూరల్: మండలంలోని బొప్పాయిపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలాసకు చెందిన వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... పలాసకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై కోటబొమ్మాళి వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణంకి తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి గాయపడిన వ్యక్తి కాలు విరిగినట్లు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు.
మద్యం బాటిళ్లతో వ్యక్తి అరెస్టు
కాశీబుగ్గ: పలాస మండలం కాంట్రగడ జంక్షన్ వద్ద 48 ఒడిశా మద్యం బాటిళ్లతో రోణంకి శేషగిరి అనే వ్యక్తి పట్టుబడినట్లు ఎకై ్సజ్ టాస్క్‌పోర్స్ సీఐ మధుకుమార్ తెలిపారు. తమ సిబ్బందితో బుధవారం కాంట్రగడ జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపడుతుండగా శేషగిరి ద్విచక్ర వాహనంపై మద్యం బాటిల్స్ రవాణా చేస్తూ పట్టుబడినట్లు వెల్లడించారు. రోణంకి శేషగిరిని అరెస్టు చేసి పట్టుకున్న మద్యాన్ని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌గా గుర్తించి వాహనాన్ని సీజ్ చేశామని వివరించారు. తనిఖీలో పలాస ఎకై ్సజ్ సీఐ మల్లిఖార్జునరావు, సిబ్బది తదితరులు పాల్గొన్నారు.
‘మాటిచ్చి ఎన్‌ఈఆర్ మోసం చేశారు’
రణస్థలం: ఎంపీపీ పదవి తనకే ఇస్తానని మాటిచ్చి ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు ఇవ్వకుండా మోసం చేశారని కోష్టా టీడీపీ సీనియర్ నాయకుడు పిషిణి జగన్నాథం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎంపీపీ పదవి ఇస్తామని.. కూటమి ధర్మం ప్రకారం తగిన గుర్తింపు ఇస్తున్నామని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో బీజేపీ అంటూ డ్రామాలాడారని వాపోయారు. ఎన్‌ఈఆర్ రాజకీయ ఎదుగుదలకు మద్దతుగా నిలబడితే ఆయన నేడు గంటకు ఒకలా మాటలు మార్చడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన 44 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి దారుణమైన రాజకీయాలు చూడలేదని కన్నీంటి పర్యంతమయ్యారు. సమావేశంలో ఆయనతో పాటు గ్రామ పెద్దలు పైడి అప్పడుదొర, పిషిణి అసిరినాయుడు, పిషిణి చిన్నం నాయుడు తదితరులు ఉన్నారు.
29న జిల్లా బేస్‌బాల్ జట్ల ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం జిల్లా జూనియర్స్ బాలబాలికల బేస్‌బాల్ జట్ల ఎంపికలు ఈనెల 29వ తేదీన జరగనున్నాయని బేస్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, ప్రధాన కార్యదర్శి గుంటముక్కల వీరభద్రరావు బుధవారం తెలిపారు. ఈ ఎంపికలు జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం మైదానంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మొదలవుతాయని పేర్కొన్నారు. ఈ ఎంపికల్లో పాల్గొనే బాలబాలికలు 2009 జనవరి ఒకటి తర్వాత జన్మించి ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడ ఎంపిక చేసిన జిల్లా జట్లను మార్కాపురం జిల్లా కనిగిరి వేదికగా డిసెంబర్ 4 నుంచి 6 వరకు జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి జూనియర్స్ బాలబాలికల ఛాంపియన్‌షిప్–2026 పోటీలకు పంపించనున్నట్టు వెల్లడించారు. ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, 2 పాస్ ఫొటోలతో ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఎంపికల్లో పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు 86390 00705 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. కాగా ఈ ఎంపికల కోసం క్రీడాకారులు గత కొన్నాళ్లగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కఠోర సాధన చేస్తున్నారు.


