● మంత్రి అచ్చెన్నకు దమ్ముంటే పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి
● ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ టెక్కలి
సమన్వయకర్త పేరాడ తిలక్
● వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్ల
తిరస్కరణపై ఆర్డీవోకు ఫిర్యాదు
టెక్కలి: ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై మంత్రి అచ్చెన్నాయుడి అండతో పోలీసులు దౌర్జన్యం చేశారని, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా ఎన్నికల అధికారులను మంత్రి బెదిరించి మరీ వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్లను తిరస్కరించేలా చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. కోటబొమ్మాళి మేజర్ పంచాయతీ సర్పంచ్ స్థానానికి వైఎస్సార్‌సీపీ మద్దతుతో కల్లి రాములమ్మ దాఖలు చేసిన నామినేషన్‌తో పాటు మరికొన్ని వార్డు సభ్యుల నామినేషన్లను అర్ధరాత్రి సమయంలో నాటకీయంగా తిరస్కరించడంతో బుధవారం టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం తిలక్ మాట్లాడుతూ.. టెక్కలి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి అచ్చెన్నాయుడుకి పూర్తిగా ఓటమి భయం పట్టుకుందన్నారు. మంత్రికి దమ్ముంటే పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, కార్యకర్తలను వేధింపులకు గురి చేయడం చేతకానితనమని దుయ్యబట్టారు. ఇప్పటికే నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ మద్దతుతో నామినేషన్ వేసిన అభ్యర్థులను పోలీసులు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.
హైకోర్టులో ఫిర్యాదు చేస్తాం
కోటబొమ్మాళి మేజర్ పంచాయతీ సర్పంచ్ స్థానానికి కల్లి రాములమ్మ నామినేషన్‌ను కుంటి సాకుతో తిరస్కరించిన ఎన్నికల అధికారిపై హైకోర్టులో ఫిర్యాదు చేస్తామని తిలక్ స్పష్టం చేశారు. నామినేషన్ దాఖలు చేసిన సమయంలో.. పరిశీలన ప్రక్రియలో నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నాయని రశీదులు ఇచ్చారన్నారు. తీరా కోటబొమ్మాళిలో టీడీపీ నాయకులు.. మంత్రి అచ్చెన్నాయుడి అండతో ఎన్నికల అధికారులపై ఒత్తిడి చేసి వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్లను అన్యాయంగా తిరస్కరించారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడడంతో ఎన్నికలంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఆయనతో పాటు నాయకులు కె.సంజీవ్, కె.విశ్వనాథ్‌రెడ్డి, కె.రాజశేఖర్ తదితరులు ఉన్నారు.


