● డబ్బు, మద్యం మత్తులో ఓటర్లను
ముంచెత్తుతున్న అభ్యర్థులు
● చీరల పంపిణీతో మహిళా ఓటర్లకు ప్రలోభాలు
● అదును చూసి ఆమ్యామ్యాలు
దండుకుంటున్న పోలీసులు
శ్రీకాకుళం క్రైమ్:
శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస మున్సిపాలిటీల్లోనే కాకుండా తొలిదశ పంచాయతీ ఎన్నికలు గురువారం జరగనున్న నేపథ్యంలో ఓటర్లను అభ్యర్థులు పలు మార్గాల్లో ప్రలోభాలకు గురిచేస్తూ ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఈనెల 24 సాయంత్రం 5 గంటలతో ప్రచార ర్యాలీలు, సభలు, సమావేశాలు ముగియడంతో పంపకాల పర్వానికి తెరలేపారు. ఎన్నికలు జరిగే దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ప్రచారం మొదలుపెట్టేటప్పుడు మందు, బిర్యానీ పంపిణీ జరిగింది. ఇది చాలదన్నట్టు శ్రీకాకుళం కార్పొరేషన్‌లో అధికార కూటమి భాగస్వామి జనసేన మేయర్ అభ్యర్థి అయితే కీలక డివిజన్లలో ఓటర్లకు వేయి నుంచి రూ.2 వేల వరకు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈ జాడ్యం ఆమదాలవలస మున్సిపాలిటీయే కాకుండా మొదటి దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న అన్ని పంచాయతీల్లోనూ మొదలుపెట్టారు. పలాస నియోజకవర్గంలోని కొన్ని పంచాయతీల్లోనైతే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ప్రలోభాల పేరిట అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారంటే ఎన్నికలు ఎంత కమర్షియల్ అయ్యాయో అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. బుధవారం సైతం సాయంత్రం 5 నుంచే మద్యం, నగదు పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాత్రంతా మరింత పంపకాలు జరిగే అవకాశం ఉందని పలువురు చర్చించుకోవడం విశేషం. పలుచోట్ల చీరల పంపిణీతో సైతం మహిళా ఓటర్లను ప్రలోభానికి గురిచేసే యత్నం అభ్యర్థులు చేస్తున్నారు.
ప్రకటనలకే నిఘా పరిమితం
ఇంత జరుగుతున్నా ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు గానీ, ఎకై ్సజ్ పోలీసులు, రెవెన్యూ వంటి కీలక విభాగాల అధికారులు మీడియాలో రోజువారీ ప్రకటనలే పరిమతమవుతున్నారు తప్ప, నిఘా పెట్టి పట్టుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. డ్రోన్ కెమెరాలు ఎక్కడ ఎగురుతున్నాయో.. సీసీ కెమెరాల డేటా ఏ చోట నిక్షిప్తమవుతుందో, తనిఖీల పేరిట దొరికే డబ్బు ఎటు పోతుందో అంటూ జనం నవ్వుకుంటున్నారు. మరీ విడ్డూరమేంటంటే.. కొన్ని స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు అటు పంచాయతీలు, ఇటు పుర, నగరపాలక అభ్యర్థుల వద్ద స్టేషన్ ఖర్చులంటూ ఆమ్యామ్యాలు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కాగా జిల్లా ఎకై ్సజ్ వర్గాల అధికారిక లెక్కల ప్రకారం ఎన్నికల కోడ్ మొదలైన అక్టోబర్ 14 నుంచి నవంబర్ 24 వరకు చూసుకుంటే రూ.175.22 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు చెప్పడం విశేషం. ఇందులో ఐఎంఎల్ కేసులు (బాక్సులు) 2,40,133 సేల్ అవ్వగా.. బీరు కేసులు 91,533 అమ్మకాలు జరిగినట్లు చెప్పారు. గడిచిన 3 రోజుల్లో అయితే రూ.18 కోట్లు మద్యం బాబులు హాంఫట్‌మనిపించారు.


