శ్రీకాకుళం క్రైమ్:
కూటమి రెండున్నరేళ్ల పాలనలో నగరం అస్తవ్యస్తమైంది. అధికార పార్టీ నేతల అండదండలతో కొంతమంది భూ కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లతో రెచ్చిపోయారు. మరికొన్ని చోట్ల దాడులకు సైతం వెనుకాడలేదు. స్థానిక టీడీపీ నేతలైతే రౌడీ షీటర్లకు వారం వారం జరిగే పోలీస్ కౌన్సిలింగ్ నుంచి వారికి సంబంధించి కేసుల వరకు డైరెక్టుగా పోలీసులతోనే జోక్యం చేసుకోవడం, వారి పుట్టిన రోజులకు ఫొటోలకు ఫోజులివ్వడం వంటివి చేసి ప్రజల ముందు పూర్తిగా చులకనైన సందర్భాలున్నాయి. నగరంలో ఈ రెండున్నరేళ్లు శాంతిభద్రతలు అదుపు తప్పాయనడానికి అనేక ఘటనలు నిదర్శనంగా నిలిచాయి.
కొన్ని ఘటనలు పరిశీలిస్తే..
శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో దాదాపు 3 వేల మందిపై బైండోవర్ కట్టారని, వీరిలో హిస్టరీ షీట్లున్నవారి సంఖ్య డబుల్ సెంచరీ (258) మార్క్ దాటిందని అధికారులు చెబుతుండడం గమనార్హం. నగరానికి చెందిన ఓ రౌడీషీటర్ సెటిల్మెంట్‌లో పాల్గొనడం, బాధితులు రూరల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడం, రౌడీ షీటర్‌పై కేసు నమోదై అరెస్టు వరకు వెళ్లే సందర్భంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే షీటర్ తరపున ఎస్‌ఐతో మాట్లాడటం, ఓ కానిస్టేబుల్ మధ్యవర్తిత్వం వహించడం దానికి సంబంధించి ఫోన్ సంభాషణలు బయటకు రావడం అప్పట్లో సంచలనం రేపింది. ఇసుక అక్రమాలు ప్రశ్నిస్తున్నాడని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడన్న నెపంతో బూర్జ గుత్తావెల్లికి చెందిన సురేష్ అనే వ్యక్తిని బలగ నడిబొడ్డున చంపేందుకు ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు యత్నించారు. ఈ ఏడాది సెప్టెంబరులో నగరంలోని దండివీధిలో టీడీపీ నాయకుల భూకబ్జా, బెదిరింపు, దౌర్జన్యాలకు ఓ వృద్ధుడు బలయ్యాడు. వృద్ధుడైన కస్పా అప్పన్న పట్నాయక్ (70) భూమిని ఆక్రమించే క్రమంలో అవతలి వ్యక్తులపై అప్పన్న కుటుంబసభ్యులు కలెక్టర్‌కు, వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయగా.. స్టేషన్‌లోనే టీడీపీకి చెందిన దొండపాటి నవీన్, గోవిందరావు అనుచరులు చంపుతామని బెదిరింపులకు పాల్పడి భయబ్రాంతులకు గురిచేశారు. జరిగిన పరిణామాలు తట్టుకోలేని వృద్ధుడు అక్కడికి కొద్దిరోజుల్లోనే కన్నుమూశాడు.
ఎక్కడెక్కడి నుంచో వచ్చి..
బ్యాంకర్స్ కాలనీలో అద్దె నివాసంలో ఉంటున్న వ్యక్తి ఇంటి యజమానితో ఆర్థిక లావాదేవీల్లో తేడాలు జరగడంతో సరుబుజ్జిలి మండలం మూలసవలాపురం లేడీ రౌడీషీటర్ బ్యాచ్‌తో కిరాయి మాట్లాడుకోవడం, నగరానికొచ్చి యజమాని నివాసంలో ఆ కిరాయి బ్యాచ్ చొరబడి చంపుతామని దాడికి యత్నించడం హాట్‌టాపిక్‌గా మారింది. నగరంలోని కిన్నెర కాంప్లెక్సు సమీపంలో పట్టపగలు ముగ్గురు దోపిడిదారులు ఓ వ్యాపారి ఇంట్లో చొరబడి మహిళలను కత్తులతో బెదిరించి కిలో బంగారం కొట్టేసేందుకు ప్లాన్ వేశారు. నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారిని పెద్దపాడు రామిగెడ్డలో చంపి పడేశారు. వాంబేకాలనీకి చెందిన ఓ వ్యక్తిని విశృంఖల శృంగారంలో భాగంగా పొన్నాడలో వ్యక్తి చంపేశాడని పోలీసులు చెప్పినా.. ఆ హత్యలోనూ ఆర్థిక లావాదేవీలే కారణమని, ఘటనాస్థలిలో మద్యం, బీరు బాటిళ్లు అధికంగా ఉండటంతో ప్రజల నుంచి అనేక ఆరోపణలొచ్చాయి.
రెండున్నరేళ్ల కూటమి పాలనలో
అస్తవ్యస్తం
అక్రమాలకు అడ్డాగా మారుతున్న వైనం
దందాలు, సెటిల్‌మెంట్లలో రౌడీ షీటర్లదే కీలకపాత్ర
కొన్నిచోట్ల
దాడులతోనూ
రెచ్చిపోయిన వైనం
వెనకుండి
నడిపించిన అధికార పార్టీ నేతలు
సమస్యాత్మక ప్రాంతాలివే..
శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లుండగా.. వీటిలో 16 అతి సమస్యాత్మక, 18 సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. నగర పరిధి చూసుకుంటే దమ్మలవీధి, గూనపాలెం, అయితినగరం, మండలవీధి, పెద్దరెల్లివీధి, బలగ, పెద్దపాడు వంటి ప్రాంతాలు అతి సమస్యాత్మకమైనవి. 258 మందిపై హిస్టరీ షీట్లుండగా వీరిలో 236 మందిని బైండోవర్ చేశారు. వీరిలో మిగిలినవారు వలస వెళ్లినవారు, జైలులో కొంతమంది ఉన్నారు. ఒకటో పట్టణ సీఐ తన పరిధిలో 125 మందిపై హిస్టరీ షీట్లు నమోదు చేశామని, 2 వేలమందికి పైగా బైండోవర్ చేశామని చెప్పగా, రెండో పట్టణ పోలీసులు 549 మందిపై బైండోవర్ కట్టామని చెప్పడం గమనార్హం. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీకాకుళం కార్పొరేషన్ డివిజన్లు 10 ఉండగా.. వీటిలో 7 ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పెద్దపాడు, పెద్దపాడు కాలనీ, తంగివానిపేట, చింతాడ(ఆమదాలవలస) అతి సమస్యాత్మకమైన డివిజన్లు కాగా.. ఖాజీపేట, కిల్లిపాలెం, పాత్రునివలస సమస్యాత్మకమైనవి. ఇప్పటికే ఈ డివిజన్ల పరిధి 200 మందిని బైండోవర్ చేసి 6 గురిపై రౌడీషీట్లు నమోదు చేశారు.


