డిసెంబర్‌ 10 నుంచి యూజీ స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 10 నుంచి యూజీ స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షలు

Nov 25 2026 9:42 AM | Updated on Nov 25 2026 9:42 AM

ఎచ్చెర్ల: ఆక్వాన్‌ తుఫాన్‌, స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఈనెల 19వ తేదీ నుంచి జరగాల్సిన యూజీ స్పెషల్‌ డ్రైవ్‌ 2, 3, 4, 5 సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చిందని, వాయిదా పడిన పరీక్షలను డిసెంబర్‌ 9, 10, 11వ తేదీల్లో నిర్వహించనున్నట్లు వర్సిటీ ఎగ్జామినేషన్‌ డీన్‌ డాక్టర్‌ ఎం.అనూరాధ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19న నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్‌ 9వ తేదీన, ఈనెల 26వ తేదీన నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్‌ 10వ తేదీన, డిసెంబర్‌ 2వ తేదీన నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్‌ 11వ తేదీన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తమ కళాశాలల విద్యార్థులకు తెలియజేయాలని అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు సూచించారు.

నామినేషన్‌ కేంద్రం వద్ద

గందరగోళం

టెక్కలి: కోటబొమ్మాళిలో నామినేషన్‌ కేంద్రం వద్ద మంగళవారం గందరగోళం పరిస్థితి చోటుచేసుకుంది. కోటబొమ్మాళి మేజర్‌ పంచాయతీ స్థానానికి వైఎస్సార్‌సీపీ మద్దతుదారు కల్లి రాములమ్మతో పాటు మరికొంతమంది వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యేవిధంగా అధికారులు కుట్రలు చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులంతా ఆందోళనకు దిగారు. ముందుగా నామినేషన్‌ పత్రాలు అన్ని సక్రమంగా ఉన్నాయంటూ అధికారులు చెప్పారని, ఆ తర్వాత టీడీపీ నాయకులు చెప్పినట్లుగా పూర్తిగా తమ నామినేషన్లను తిరస్కరణకు గురయ్యేవిధంగా అధికారులు ప్రవర్తించారంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దుయ్యబట్టారు. నామినేషన్‌ పత్రాలు తిరస్కరణకు గురైతే కారణాలు చూపించాలని పట్టుబట్టారు. వాటితో ఉన్నతాధికారుల వద్దకు వెళ్తామని పేర్కొన్నారు. నామినేషన్‌ పరిశీలన విషయంలో అధికారుల తీరుపై తప్పుబడుతున్నారు.

పంచాయతీ పోలింగ్‌ రోజుల్లో స్థానిక సెలవు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ తేదీల్లో ఆయా మండలాల పరిధిలో స్థానిక సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌–1881 ప్రకారం పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మొదటి విడత పోలింగ్‌ జరిగే ఈ నెల 26వ తేదీన ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో సెలవు ఉంటుందని పేర్కొన్నారు. రెండో విడత పోలింగ్‌ జరిగే ఈ నెల 29న ఎచ్చెర్ల, జి.సిగడాం, లావేరు, రణస్థలం, ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, కొత్తూరు, హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట, మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లో సెలవు ప్రకటించారు. అలాగే మూడో విడత పోలింగ్‌ జరిగే డిసెంబర్‌ 2వ తేదీన నరసన్నపేట, పోలాకి, జలుమూరు, శ్రీకాకుళం, గార, సారవకోట, టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మండలాల్లో స్థానిక సెలవు ఉంటుందని కలెక్టర్‌ వెల్లడించారు.

‘మమ్మల్ని ఎవరూ కిడ్నాప్‌ చేయలేదు’

రణస్థలం: తన భార్య మన్నెల లక్ష్మిని ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, ఇదంతా ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌ బలవంతంగా తమ పిల్లలతో చెప్పించారని లక్ష్మి భర్త మన్నెల సోములు తెలిపారు. తన భార్య లక్ష్మి బంటుపల్లి పంచాయతీలో 3వ వార్డు మెంబర్‌గా నామినేషన్‌ వేశారని, అయితే విత్‌ డ్రా చేసుకోవాలని ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌ అనుచరులు తమపై దాడి చేసి, ఊరులో లేకుండా చేస్తామని, చంపేస్తామని భయపెట్టారని ఆయన తెలిపారు. ఈ భయంతో తాము బయటకు వెళ్లి తలదాచుకున్నామని వివరణ ఇచ్చారు. అంతే తప్ప మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌, బంటుపల్లి మాజీ సర్పంచ్‌ పాశపు ముకుంద కిడ్నాప్‌ చేసినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌ తమ పిల్లలతో ఇలా బలవంతంగా చెప్పించారని లక్ష్మి, సోములు తెలిపారు. దయచేసి ప్రభుత్వ అధికారులు, పోలీసులే తమను రక్షించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement