జలుమూరు: కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం శ్రీముఖలింగం వంశధార నదీతీరాన బాలియాత్ర వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ యాత్ర మధ్యాహ్నం వరకు కొనసాగింది. ముందుగా ప్రధాన దేవాలయంలో గణపతి పూజతో ప్రారంభించి.. మధుకేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. పూర్ణ కుంభంతో బాలియాత్ర ప్రారంభించారు. అర్చకులు, పురోహితుల వేద మంత్రోచ్చరణల నడుమ మంగళహారతులిస్తూ స్వామివారిని కీర్తిస్తూ వంశధార నదికి చేరుకున్నారు. దీనికి ముందు బాలియాత్ర చరిత్ర, కళింగ రాజ్యం స్థాపన నాటి పరిపాలన, నౌకాయానం తదితర విషయాలు నిర్వాహక కమిటీ ప్రతినిధులు వివరించారు. భక్తులు నదిలో ఇష్టదైవాలకు పూజలు చేసి అరటి దొప్పలపై చక్కగా దీపాలంకరణ చేసి నదిలో విడిచిపెట్టారు. అర్చకులు నదికి నక్షత్ర, కుంభ, అష్టాదశ హారతులిచ్చారు. ఎంతో విశిష్టత, వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బాలియాత్రను ప్రభుత్వ కార్యక్రమంగా గుర్తించి నిర్వహించాలని నిర్వహక కమిటీ ప్రతినిధులతోపాటు భక్తులు కోరారు. కళింగ రాజ్యంలో నిర్వహించే ఈ యాత్ర నేడు ఒడిశాలో అధికారికంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని భక్తులు తెలిపారు. మన రాష్ట్రంలో ఇప్పటికై నా గుర్తించి ప్రభుత్వం నిర్వహించేలా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని విన్నవించారు. కార్యక్రమంలో మొజ్జాడ రామారావు, కె.హరిప్రసాద్, ఎం.బసవ వెంకటరమణ, ఈవో ఏడుకొండల, ఆలయ చైర్మన్ శివప్రసాద్ పాడి తదితరులు పాల్గొన్నారు.


