● మరో ఇద్దరికి గాయాలు
● వెలగని వీధి దీపాలే ప్రమాదానికి
కారణమంటూ స్థానికుల ఆరోపణ
కాశీబుగ్గ: కాశీబుగ్గ పాత జాతీయ రహదారి పద్మనాభపురంలో మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు వస్తుండగా ఎదురుగా ఏముందో తెలియక గుర్తించేలోగా అదుపుతప్పింది. బైక్ వేగంగా వచ్చి ఎదురుగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు క్షతగాత్రులయ్యారు. వివరాలిలా ఉన్నాయి. వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామానికి చెందిన డొక్కరి దివాకర్ (25) తన స్నేహితులైన పిల్లల బాలకృష్ణ, దట్టి గోవిందుతో కలిసి ద్విచక్ర వాహనంపై పట్టణంలోకి వస్తున్నారు. వీరు పద్మనాభపురం సమీపానికి వచ్చేసరికి అదుపుతప్పి పడిపోయారు. దీంతో ముగ్గురూ ద్విచక్ర వాహనం పైనుంచి పడిపోయారు. బైక్‌పై ముందు కూర్చున్న దివాకర్ ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఢీకొనడంతో అతని తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయాడు. వెనుక కూర్చున్న పిల్లల బాలకృష్ణ, గోవిందులు గాయపడ్డారు. వీరిద్దరినీ పలాస ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిత్యం ప్రమాదాలు
పద్మనాభపురం సమీపంలోని పాత జాతీయ రహదారిపై వీధిదీపాలు వెలగకపోవడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా మంగళవారం సాయంత్రం చీకట్లో వాహనం అదుపుతప్పి పాతికేళ్ల యువకుడు అసువులు బాయడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ మార్గంలో వీధిదీపాలు వెలగకపోవడంతో రాత్రి సమయాల్లో రహదారి అంతా చిమ్మచీకటిగా మారుతోంది. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. అయినా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలం నుంచి ఈ సమస్యపై మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు మొద్దునిద్ర వీడి, తక్షణమే పాత జాతీయ రహదారిపై వీధిదీపాలు ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


