శ్రీకాకుళం పాతబస్టాండ్: డీఎస్సీ–2026 సెకెండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్‌జీటీ), స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న జిల్లాకు చెందిన బీసీ అభ్యర్థులకు ఉచితంగా ఆన్‌లైన్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ సంచాలకులు ఇ.అనూరాధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, విజయవాడ ఆదేశాల మేరకు శిక్షణ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. టెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే ఉచిత శిక్షణకు అర్హులని స్పష్టం చేశారు.
ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో పాటు 10వ తరగతి, టీటీసీ/బీఎడ్ మార్కుల జాబితాలు, టెట్ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం, రూ.లక్ష లోపు వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను జతపరచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 25లోగా వాంబే కాలనీ, 80 ఫీట్ రోడ్డు, టీడీపీ కార్యాలయం వెనుక గల ఏపీ బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందజేయాలని కోరారు. పూర్తి వివరాలకు 83328 52106, 73829 75679 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో స్కూల్ వాచ్‌మేన్ మృతి
ఇచ్ఛాపురం రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని పాఠశాల నైట్ వాచ్‌మేన్ మృతి చెందాడు. ఇచ్ఛాపురం మండలం కె.శాసనాం ఉన్నత పాఠశాల నైట్ వాచ్‌మేన్‌గా పనిచేస్తున్న కొండపు మాదయ్య(45) గురువారం వేకువజామున టి.బరంపురంలోని తన ఇంటి వద్ద నుంచి నడక దారిన పాఠశాలకు వెళ్తుండగా గ్రామం పొలిమేరలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. మాదయ్యకు భార్య రీతా, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. రూరల్ ఎస్‌ఐ ఆర్.జనార్దనరావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు.
రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌లో సత్తాచాటండి
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ పోటీల్లో తుది వరకు పోరాడి విజయాలతో తిరిగిరావాలని జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి చల్లా జగదీష్ పిలుపునిచ్చారు. కర్నూలు వేదికగా ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న 70వ ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–17 బాలబాలికల ఫెన్సింగ్ చాంపియన్‌షిప్–2026 పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల బృందం గురువారం ఇక్కడి నుంచి పయనమై వెళ్లింది. వీరికి శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో జీఎం జ్యోతిరాణి, టి.యశోద, అనితశ్రీ, భవానీ, కోచ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ పయనమైన స్క్వాష్ ప్లేయర్స్..
కాకినాడ వేదికగా ఈ నెల 20 నుంచి 22 వరకు జరగనున్న 70వ ఏపీ రాష్ట్రస్థాయి అండర్–14, 17, 19 బాలబాలికల స్క్వాష్ చాంపియన్‌షిప్–2026 పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల బృందం గురువారం డీఈఓ కార్యాలయం సమీపంలోని జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యాలయం నుంచి పయనమై వెళ్లింది. వీరికి ఎస్‌జీఎఫ్ సెక్రటరీ సీహెచ్ జగదీష్‌తోపాటు పీడీలు, కోచ్ మేనేజర్లు తదితరులు పలు సూచనలు చేశారు.
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
శ్రీకాకుళం అర్బన్: సత్యసాయి 101వ జన్మదిన వేడుకలు సందర్భంగా జిల్లా కేంద్రంలోని సత్యసాయి పెద్దమందిరంలో గురువారం నృత్యదర్శకురాలు డాక్టర్ టి.నీరజ శిష్యబృందం చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. విఘ్నరాజమ్ భజే, గణపతి తాళం, భైరవి శతకం, అష్టలక్ష్మీ స్తోత్రం, కాలభైరవ అష్టకం, శివోహం నృత్యరూపకం, భళీభళి రామ తదితర అంశాలు వీటితో పాటు సత్యసాయి బాబా శతవర్షి ప్రత్యేక పాటకు నృత్యాలు చేశారు.
సాహిత్యంతో సామాజిక మార్పు
శ్రీకాకుళం: సాహిత్యం సామాజిక మార్పునకు సాధనం కావాలని జనసాహితి రాష్ట్ర అధ్యక్షుడు పి.ఎస్.నాగరాజు అన్నారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని, జిల్లా కేంద్ర గ్రంథాలయం, జనసాహితి(శ్రీకాకుళం) సంయుక్త నిర్వహణలో గురువారం ‘జనసాహితి ప్రచురణలు‘ పేరిట పుస్తక పరిచయ సభ నిర్వహించారు. కార్యక్రమంలో జనసాహితి జిల్లా కార్యదర్శి పి.మోహనరావు, పలువురు కవులు, రచయితలు, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


