పంచాయతీల మూడో విడతకు నోటిఫికేషన్‌ జారీ | - | Sakshi
Sakshi News home page

పంచాయతీల మూడో విడతకు నోటిఫికేషన్‌ జారీ

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

● మూడో విడతలో 10 మండలాల్లో

324 పంచాయతీలు, 3054 వార్డులకు ఎన్నికలు

● వీటితో పాటు పలాస మండలం లొద్దభద్ర పంచాయతీకి కూడా ఎన్నికలు నిర్వహణకు ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ

● 21 నుంచి నామినేషన్ల స్వీకరణ..

23 లోగా స్వీకరణకు గడువు

● డిసెంబర్‌ 2న పోలింగ్‌, ఫలితాల వెల్లడి

అరసవల్లి: పంచాయతీల మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఈమేరకు జిల్లాలో మొత్తం శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల పరిధిలోని 10 మండలాల్లో మొత్తం 324 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో మూడో విడతలో పోలింగ్‌ జరుగనున్న గ్రామ పంచాయతీల వివరాలతో పాటు అభ్యర్థులకు సూచనలతో కూడిన వివరాలను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణిలు వెల్లడించారు.

ఈ ప్రకారం జిల్లాలో ముందుగా శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌లో శ్రీకాకుళం, గార, ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఆమదాలవలస, సరుబుజ్జిలి, పొందూరు, బూర్జ మండలాలతో పాటు టెక్కలి డివిజన్‌ పరిధిలోని టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం తదితర 10 మండలాల్లోని మొత్తం 324 గ్రామ పంచాయతీలు, 3054 వార్డు సభ్యుల స్థానాలకు డిసెంబర్‌ 02న పోలింగ్‌ జరుగనుంది. మొత్తం 445 లొకేషన్లలో 3112 పోలింగ్‌ కేంద్రాలను, మొత్తంగా 3424 బ్యాలెట్‌ బాక్సులను కూడా సిద్ధం చేశారు.

ఎన్నికల ప్రక్రియ ఇలా..

● నామినేషన్ల స్వీకరణ: 21వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి.. 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు.

● ఈ నెల 24న ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన.

● 27న మధ్యాహ్నం 3 గంటల్లోపే నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటన.

● డిసెంబర్‌ 2 న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌.

● అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి.

● వచ్చే నెల 03న అవసరమైతే రీపోలింగ్‌..అదే రోజు ఫలితాల వెల్లడి.

లొద్దభద్ర పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

తొలివిడతలో పలాస నియోజకవర్గంలో 19 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సిన తరుణంలో వివిధ కారణాలతో లొద్దభద్రలో ఎన్నికల నిర్వహణ జరగలేదు. ఈ పంచాయతీకి మూడో విడతలో పోలింగ్‌ జరిపేలా రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు లొద్దభద్ర పంచాయతీకి మూడో విడత షెడ్యూల్‌ ప్రకారం 324 పంచాయతీలకు ఎలా ఎన్నికలు జరుగుతాయో..అదే షెడ్యూల్‌ ప్రకారం లొద్దభద్రలో ఎన్నికలు జరుగనున్నాయని జిల్లా ఎన్నికల అదనపు అఽధికారి, జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి ప్రకటించారు. దీంతో లొద్దభద్రలో కూడా ఎన్నికల హడావుడి మొదలుకానుంది. ఈ ప్రకారం మొత్తం మూడు విడతల్లో 905 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహణకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement