డ్రైవర్‌కు లక్కీ చాన్స్‌ | - | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌కు లక్కీ చాన్స్‌

Nov 17 2026 12:32 AM | Updated on Nov 17 2026 12:32 AM

అరసవల్లి: ఆ యువకుడి పేరు జీవీఎస్‌ఎన్‌ మూర్తి (జీవి)... వృత్తి రీత్యా కారుకు ఆప్టింగ్‌ డ్రైవింగ్‌కు వెళ్తుంటాడు. కానీ ఆయన జీవితం ఊహించని మలుపు తిరిగి రాజకీయాల వైపు మళ్లింది. అరసవల్లి పరిధిలోని లక్ష్మీనగర్‌ (డివిజన్‌–5) ప్రాంత కార్పొరేటర్‌గా వైఎస్సార్‌సీపీ తరఫున పోటీకి బరిలో నిలిచాడు. సామాజిక వర్గ కేటాయింపుల్లో భాగంగా ఈ డివిజన్‌ ఎస్టీ జనరల్‌కు స్థానం కేటాయించడంతో స్థానికుడై, సవరకాపు కులస్థుడైన జీవీ రిజర్వేషన్‌ కోటాలో ఎన్నికల బరిలో నిలిచాడు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి గుండ లక్ష్మీదేవితో పాటు అరసవల్లి సూర్యదేవాలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మతో పాటు ప్రముఖ వైద్యుల కార్లకు కూడా ఈ యువకుడు కొన్నిసార్లు ఆప్టింగ్‌ డ్రైవర్‌గా పనిచేశాడు. ఇతడు కచ్చితంగా గెలిచే అవకాశం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతం: ఎస్పీ

శ్రీకాకుళం క్రైమ్‌ : శ్రీకాకుళం నగర పాలక, ఆమదాలవలస పురపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం సాయంత్రంతో ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయం, వంశధార కార్యాలయం వద్ద అదే విధంగా ఆమదాలవలస మున్సిపల్‌ కార్యాలయం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. నామినేషన్ల నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని ఎస్పీ తెలిపారు. మొదటి విడత పంచాయతీ సర్పంచి ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ నేటితో ముగుస్తుందని కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరించి కొనసాగుతుందని ఎస్పీ వెల్లడించారు.

‘ఇప్పుడైనా మంచివి ఇవ్వండి’

జి.సిగడాం: పరిషత్‌ ఎన్నికల్లో స్వస్తిక్‌ ముద్రతో పాటు ఇతర సామాన్లు సరైనవి ఇవ్వలేదని దీంతో పోలింగ్‌ సిబ్బంది ఇబ్బంది పడ్డారని, ఇప్పటికై నా సర్పంచ్‌ ఎన్నికలకు నాణ్యమైనవి ఇవ్వాలని ఆర్‌ఓలు, సిబ్బంది కలిసి మండల అధికారులకు విన్నవించారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో స్టేజ్‌–2 ఆర్‌ఓల శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ ఎంపీటీసీల ఎన్నికల కోసం వినియోగించే స్వస్తిక్‌ ముద్ర సక్రంగా పడకపోవడంతో ఓటర్లు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారన్నారు. అలాగే గమ్ము, ఇతర సామాగ్రి కూడా కిట్‌లో అరకొక ఉండటంతో సొంత డబ్బుతో కొన్నామని తెలిపారు. సర్పంచ్‌ ఎన్నికలకై నా స్వస్తిక్‌ ముద్ర, సామగ్రి నాణ్యమైనవి అందించాలని కోరారు.

ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్‌ వైర్‌ చోరీ

సోంపేట: మండలంలోని పాలవలస గ్రామంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం చేసి వాటిలోని కాపర్‌ వైరు చోరీ చేసినట్లు విద్యుత్‌ శాఖ జేఈ రమణ తెలిపారు. పాలవలస ఎఫ్‌సీఐ గౌడౌన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, పాలవలస జాతీయ రహదారి వద్ద వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్‌ వైర్‌ను దొంగిలించారు. సంఘటన స్థలాన్ని విద్యుత్‌ శాఖాధికారులు సోమవారం పరిశీలించి బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేజీబీవీ విద్యార్థిని అదృశ్యం

గార: మండలంలోని శాలిహుండం కేజీబీవీలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని ఆదివారం సాయంత్రం నుంచి అదృశ్యమైంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు రావడంతో గేట్లు తెరిచి ఉంచారు. ఆ సమయంలో గేటు సమీపంలోనే ఒక యువకుడు బైక్‌తో ఉండగా, వెంటనే అక్కడనుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు టీచర్‌ కల్యాణి ఫిర్యాదు చేశారు. ఈ విద్యార్థిని అరసవల్లి బాలసదన్‌ నుంచి ఇక్కడికి వచ్చిందని పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సీహెచ్‌ గంగరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement