సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల సమర భేరి మోగింది. గురువారం నోటిఫికేషన్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. 17 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయం మరోసారి వేడెక్కింది. శ్రీకాకుళం మేయర్‌తో పాటు ఆమదాలవలస మున్సిపల్ చైర్‌పర్సన్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ జరగనుండగా ఈ నెల 26వ తేదీన పోలింగ్ జరుగుతుంది. 30వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. శ్రీకాకుళంలో వైఎస్సార్ సీపీ, జనసేన మధ్య పోటీ జరగనుండగా, ఆమదాలవలసలో వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
శ్రీకాకుళం మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఆమదాలవలస మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. శ్రీకాకుళం కార్పొరేషన్‌లో 60 డివిజన్‌లకు, ఆమదాలవలస మున్సిపాలిటీలో 28 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 14 నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ, 17న నామినేషన్ల పరిశీలన, 19న ఉపసంహరణ, 26న పోలింగ్, 27న అవసరమైతే రీపోలింగ్, 30న లెక్కింపు జరగనుంది. నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడం వల్ల పార్టీలకు సమయం లేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవి
శ్రీకాకుళం నగర పాలక సంస్థ మేయర్ పదవికి వైఎస్సార్‌సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పోటీ చేయనున్నారు. ఆమె అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైంది. కూటమి తరఫున జనసేనకు కేటాయించడంతో ఆ పార్టీ తరఫున దానేటి రాధారాణి పోటీ చేయనున్నారు. డివిజన్‌ల నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికే మిగిలి ఉంది. ఆమదాలవలస మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి వైఎస్సార్ సీపీ తరఫున బొడ్డేపల్లి రమేష్‌కుమార్ సతీమణి బొడ్డేపల్లి అజంతాకుమారి పోటీ చేయనున్నారు. టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది తేలలేదు.
నామినేషన్లకు సమయం లేదు
రేపటి నుంచే నామినేషన్లు జరగనుండటంతో పోటీ చేసే అభ్య ర్థులకు సమయం లేని పరిస్థితి నెలకొంది. ఈ లోపే నామినేషన్‌కు కావాల్సిన అన్ని ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా కార్పొరేషన్, మున్సిపాలిటీల నుంచి ఎలాంటి పన్ను బకాయి లేదని ఎన్‌ఓసీ తెచ్చుకోవాలి. ఒకవేళ బకాయి ఉంటే.. వాటిని చెల్లించి నో డ్యూ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. వీటిన్నింటికి గడువు తక్కువగా ఉండటంతో అభ్యర్థులతో పాటు పార్టీలు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు
మేయర్ పదవికి: మేయర్ పదవికి పోటీ చేయదలచిన అభ్యర్థుల నామినేషన్లను శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్, కలెక్టర్ ఆఫీస్ లో స్వీకరిస్తారు.
కార్పొరేటర్ పదవులకు: శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్ పదవులకు పోటీ చేయదలచిన అభ్యర్థుల నామినేషన్లను బొందిలీపురం రోడ్డులోని వంశధార కార్యాలయ ప్రాంగణం వద్ద స్వీకరిస్తారు.
సమయం: ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.
మరోసారి మోగిన మున్సిపల్ ఎన్నికల సమరభేరి
శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస మున్సిపాలిటీకి ఎన్నికలు
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
26న పోలింగ్
30వ తేదీన ఓట్ల లెక్కింపు
సమయం తక్కువగా ఉండటంతో
ప్రధాన పార్టీల పరుగులు


