● మూతబడిన నరసన్నపేట మహిళా మార్ట్
● వైఎస్సార్‌సీపీ హయాంలో లాభాల్లో నడిచిన మార్ట్
● కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి తల్లకిందులు
● మూన్నాళ్ల ముచ్చటగా నడిపి మూసేసిన వైనం
నరసన్నపేట: మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన మహిళా మార్ట్‌లు కూటమి పాలనలో తిరోగమనంలో పయనిస్తున్నాయి. లక్షలాది రూపాయల వ్యాపారంతో కళకళలాడిన మహిళా మార్ట్‌లు కూటమి ప్రభుత్వం వచ్చాక మూతపడుతున్నాయి. దీనికి నరసన్నపేటలోని మహిళా మార్టే ఉదాహరణ. ప్రయోగాత్మకంగా నరసన్నపేటలో 2022 డిసెంబర్ 14న అప్పటి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేటలో మహిళా మార్ట్‌ను ప్రారంభించారు. అప్పట్లో 22 వేల మంది స్వయం శక్తి సంఘ సభ్యుల నుంచి రూ.110 చొప్పున షేర్ ధనంగా వసూలు చేసి రూ. 24 లక్షల పెట్టుబడితో నిత్యావసర సరుకుల దుకాణాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలో మొదటి 10 మార్ట్‌ల్లో నరసన్నపేట ఒకటిగా నిలిచింది. చాలా కాలం పాటు లాభాల్లో నడిచి ఆడ పడుచులకు అదనపు సంపాదన అందించింది. దీంతో మిగిలిన నియోజకవర్గ కేంద్రాల్లో ఈ విధంగా మహిళా మార్ట్‌లు ఏర్పాటు చేసి తక్కువ ధరలకు, నాణ్యమైన సరుకులు అందించాలని అప్పటి డీఆర్డీఏ పీడీ విద్యాసాగరరావు ప్రయత్నాలు చేశారు.
కానీ ప్రభుత్వం మారాక ఈ మార్ట్‌ల తలరాత కూడా మారిపోయింది. మంచి లాభాల్లో నడుస్తున్న మార్ట్‌లు కూటమి హయాంలో నష్టాల బాటలోకి వచ్చేశాయి. సర్కారు నిర్లక్ష్యం, అధికారులు పట్టించుకోకపోవడంతో మార్ట్‌లో సరుకుల అరలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో జిల్లాలో ఇతర ప్రాంతాలకు విస్తరణ అటకెక్కగా శుభ్రంగా నడిచిన నరసన్నపేట మార్ట్‌ను మూసేశారు. స్థానికుల నుంచి ఒత్తిడి రావడంతో దీన్ని మళ్లీ తెరిపించి రెండోసారి నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి డిసెంబర్ 24న ప్రారంబించారు. సంక్రాంతి సందర్భంగా రెండు నెలలు నడిచింది. అంతే మళ్లీ కథ మొదటికే వచ్చింది. నిర్వహణ సరిగా లేక, సిబ్బంది సక్రమంగా దృష్టి పెట్టలేక ప్రస్తుతం పూర్తిగా మూత వేశారు. అప్పట్లో మహిళా సంఘాల నుంచి సేకరించిన షేర్ దనం డబ్బు ఏం చేశారు..? నష్టాల్లోకి వెళ్లడానికి కారణాలు ఏమిటి.? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. డీఆర్‌డీఏ అధికారుల ద్వంద్వ వైఖరే నరసన్నపేట మహిళా మార్ట్ మూతకు కారణమని స్థానిక మహిళా సంఘాల ప్రతినిధులు అంటున్నారు. మహిళా మార్ట్ నిర్వహణకు కేటాయించిన నిధులు గోల్‌మాల్ అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత మండల మహిళా సమాఖ్య పనితీరుపైనా ఆరోపణలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం మార్ట్‌లో మరో రూ. 2 లక్షల వరకూ సరుకులు ఉన్నాయని ఇవి కాలం చెల్లే దశకు చేరుకుంటున్నాయని తెలుస్తోంది. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మళ్లీ తెరుస్తాం
మహిళా మార్ట్ ప్రస్తుతం మూత పడింది. దీన్ని మళ్లీ తెరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా వచ్చిన డీఆర్‌డీఏ పీడీ మురళి దీనిపై సమీక్ష చేశారు. కొద్ది రోజుల్లో తెరిచి నిర్వహిస్తాం.
– లలిత కుమారి ఏపీఎం, నరసన్నపేట


