నిరుద్యోగులు భృతి అడిగితే నో మనీ..
50 ఏళ్లు దాటిన వారు పింఛన్లు అడిగితే నో మనీ.. మహిళలు ఆడబిడ్డ నిధి అడిగితే నో మనీ..
వలంటీర్లను నియమించమంటే నో మనీ..
కానీ డప్పు కొట్టించుకోవడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర దండిగా డబ్బులుంటాయి. ప్రభుత్వాన్ని తెగ పొగిడేందుకు సర్కారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు జీతాలు ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ మేరకు ప్రతిపాదన కూడా చేసింది. దీనిపై అన్ని వర్గాల వారూ మండిపడుతున్నారు. –ఎల్.ఎన్.పేట
రాజకీయ ప్రచారానికి ప్రజల సొమ్మా..?
సేవ చేస్తున్న వలంటీర్లకు రూ.5వేలు వేతనం ఇస్తే ప్రజాధనం దుర్వినియోగం అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రజాధనంతో ప్రోత్సాహకాలు ఇస్తామంటున్నారు. రాజకీయ ప్రచారానికి ప్రభుత్వ సొమ్ము వినియోగించడం సరికాదు.
– దుర్గాసి భాస్కరరెడ్డి, మాజీ వలంటీర్,
మశాఖపురం, ఇచ్చాపురం మండలం
హామీ మరిచారు
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వలంటీర్లకు రూ.10వేలు జీతం ఇస్తామని చెప్పింది. కానీ మర్చిపోయింది. అధికారం దక్కాక వలంటీర్ల ఊసెత్తడమే మానేసింది. ఇప్పుడు ప్రచారం కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లకు జీతాలిస్తామంటోంది.
– బోసి దుర్గయ్య, మాజీ వలంటీర్


