కృత్రిమ వేషం | - | Sakshi
Sakshi News home page

కృత్రిమ వేషం

Sep 29 2026 1:09 AM | Updated on Sep 29 2026 1:09 AM

రూ.10లు, రూ.20ల

స్టాంపులేమయ్యాయి?

అధికారుల పర్యవేక్షణ ఏదీ?

కమీషన్ల కోసం..

కాశీబుగ్గ :

జంట పట్టణాల్లో కమీషన్ల పర్వం కొనసాగుతోంది. సామాన్యులకు అత్యంత అవసరమైన నోటరీ, అఫిడవిట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజలకు పలాస–కాశీబుగ్గలో కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందుబాటులో ఉండాల్సిన రూ.10, రూ. 20ల విలువ చేసే ఇ–స్టాంపులు ప్రస్తుతం అందుబాటులో లేవు. ఓ రకంగా చెప్పాలంటే విక్రయదారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అదనుగా భావించి సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. కేవలం రూ.10, రూ. 20 ఖర్చుతో సరిపెట్టాల్సిన చోట రూ. 50, రూ. 100ల విలువైన స్టాంపులను అధిక ధరలకు అంటగడుతూ దోపిడీకి పాల్పడుతున్నారు.

కమీషన్లే పరమావధిగా..

ఇ– స్టాంపుల కృత్రిమ కొరత వెనుక పెద్ద తంతే నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.10, రూ. 20 స్టాంపులను అమ్మితే కమీషన్‌ తక్కువ వస్తుందని వెండర్లు వాటి జోలికి పోవడం లేదు. అదే అధిక విలువ కలిగిన రూ. 50, రూ. 100 స్టాంపులను విక్రయిస్తే ఎక్కువ లాభం ఆర్జించవచ్చనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. పైగా రూ. 50ల స్టాంపును రూ. 70లకు, రూ. 100 స్టాంపును రూ. 120కు అంటగడుతున్నారు.

ఇ–స్టాంపులొచ్చినా..

గతంలో మాన్యువల్‌ స్టాంపు పేపర్లను విక్రయించేవారు. అవి నిరంతరం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. దీన్ని అధిగమించేందుకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా ఇ–స్టాంపులను విక్రయించే విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. వాస్తవంగా ఈ పద్ధతిలో ఏ ధర స్టాంపయినా అందుబాటులో ఉంటుంది. కానీ విక్రయదారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ధర స్టాంపులను బ్లాక్‌ చేసి అధిక ధరల స్టాంపు పేపర్లను అమ్ముతున్నారు.

చట్టపరమైన అఫిడవిట్లు, చిన్నపాటి దస్తావేజులు, నోటరీ అవసరాలకు రూ. 10, రూ. 20 స్టాంపులు సరిపోతాయి. కానీ పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఎక్కడ వెతికినా ఈ తక్కువ ధర స్టాంపులు లభించని పరిస్థితి. అదేంటని వెండర్లను అడిగితే అందుబాటులో లేవు, జనరేట్‌ అవడం లేదంటూ సమాధానం ఇస్తున్నారు. ఇంకొందరైతే సర్వర్లు మొరాయిస్తున్నాయంటూ సాకులు చూపుతున్నారు. ఇవన్నీ తెలియని సగటు ప్రజలు అవసరం లేకున్నా రూ. 50, రూ. 100 స్టాంపులను కొనాల్సి వస్తోంది.

పలాస–కాశీబుగ్గలో

అందుబాటులో లేని రూ.10లు, రూ.20ల ఇ–స్టాంపు పత్రాలు

జంట పట్టణాల్లో లైసెన్స్‌దారుల దోపిడీ పర్వం

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే స్టాంపు విక్రయదారులు ఇలా వ్యవహరిస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తక్కువ ధర స్టాంపులను ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న విక్రయదారులపై చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement