శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం జిల్లాకేంద్రంలోని డే అండ్ నైట్ కూడలి సమీప నాగావళి నది వంతెన వరుస విషాదాలకు వేదికవుతోంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ముగ్గురు వ్యక్తులు వంతెన పైనుంచి దూకడం స్థానికంగా కలకలం రేపుతోంది. నది పరవళ్లు వీక్షిస్తున్న స్థానికులు చూస్తుండగానే ఒక వృద్ధురాలు సోమవారం నదిలోకి దూకి గల్లంతయ్యింది. ఇటీవల గల్లంతైన వారి కోసం పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం సేవించిన మత్తులో ఉండడం, కొందరి మానసిక స్థితి, ఆందోళనలే నదిలో దూకేందుకు ప్రేరేపిస్తున్నాయని పోలీసులు భావిస్తున్నారు.
అనారోగ్య కారణంతోనే..?
జిల్లాకేంద్రంలోని ఫాజుల్‌బేగ్‌పేటకు చెందిన కొమ్మనాపల్లి భారతి అనారోగ్య కారణాలతో నడుచుకుంటూ వచ్చి నదిలో దూకేసినట్లు రెండో పట్టణ పోలీసులు పేర్కొన్నారు. ఈమె భర్త కొమ్మనాపల్లి నాగరాజు కర్రీ పాయింట్‌లో పనిచేస్తుండగా.. ఈమె ఇంటివద్దనే ఉంటుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. అందరికీ వివాహాలయ్యాయి. కొడుకు మెడికల్ రిప్రెజింటేటివ్ కాగా.. కోడలు పైడిభీమవరంలో పనిచేస్తుంది. బీపీ, షుగర్, కీళ్లనొప్పులు ఉన్న భారతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం విధులు నుంచి రాగానే హాస్పిటల్‌కు వెళ్దామని భర్త నాగరాజుకు చెప్పారు. ఈలోగా ఏం నిశ్చయించుకుందో ఏమో.. సాయంత్రం కిమ్స్‌కు నడుచుకుంటూ వెళ్లే యత్నంలో మార్గమధ్యలో డేఅండ్‌నైట్ వంతెన పైనుంచి అక్కడ ఉన్నవారు చూస్తుండగానే అకస్మాత్తుగా దూకేసింది. దీనిపై మిస్సింగ్ కేసుగా రెండో పట్టణ ఎస్‌ఐ బొడ్డేపల్లి హైమావతి కేసు నమోదు చేశారు.
జల్లెడ పడుతున్న బృందాలు
గల్లంతైన వారి ఆచూకీ కోసం 4 రోజులుగా ఒకవైపు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, మరోవైపు ఒకటో, రెండో పట్టణ, రూరల్, గార పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఏడీఎఫ్‌వో శ్రీనుబాబు ఆదేశాలతో రెస్క్యూ బోట్లలో నదీతీర ప్రాంతాలతో పాటు గణగళ్లవానిపేట సముద్రం వైపు బృందాలు వెళ్లాయి. ఈనెల 25, 27 తేదీల్లో గల్లంతైన గుజరాతీపేట వేంకటేశ్వరనగర్‌కు చెందిన దువ్వు మోహనరావు, పెద్ద రెల్లివీధికి చెందిన మాడుగుల షణ్ముఖశ్రీను (36)ల కోసం రెస్క్యూ బోట్లలో సిబ్బంది సోమవారం ఉదయం కల్లేపల్లి బీచ్ నుంచి వెదకడం ఆరంభించారు. వీరితో పాటు షణ్ముఖశ్రీను బంధువులు సైతం మరో బోట్లో వెళ్లారు. సాయంత్రం వరకు అలా వెదుకుతుండగా డేఅండ్‌నైట్ వంతెన పైనుంచి యువతి దూకినట్లు సమాచారం రావడంతో సిబ్బంది వెనుదిరిగారు. అప్పటికే ఆమె ప్రవాహంలో కొట్టుకుపోయింది.
షణ్ముఖ శ్రీను మృతదేహం గుర్తింపు
ఈ క్రమంలో షణ్ముఖ శ్రీను బంధువులు పొన్నాడ వంతెన సమీప లంకదిబ్బ వైపు ఒక మృతదేహం తేలియాడినట్లు కనిపిస్తుందని చెప్పడంతో సిబ్బంది బోట్‌పై వెళ్లారు. నీటి ప్రవాహం తక్కువ వున్న వైపు సిబ్బంది, శ్రీను బంధువులు ఈదుకుంటూ వెళ్లి మృతదేహం వద్దకు చేరి ఆ మృతదేహం షణ్ముఖ శ్రీనుదిగా గుర్తించి సమీప డచ్‌బంగ్లా వైపు తీసుకొచ్చారు. దీనిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
నాగావళి వంతెన పైనుంచి దూకి వృద్ధురాలు గల్లంతు
వరుసగా 4 రోజుల్లో 3 ఘటనలు
గాలింపు చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు బృందాలు
ఒకరి మృతదేహం లభ్యం


