నైరా కళాశాల సందర్శన | - | Sakshi
Sakshi News home page

నైరా కళాశాల సందర్శన

Sep 29 2026 1:09 AM | Updated on Sep 29 2026 1:09 AM

శ్రీకాకుళం రూరల్‌: శ్రీకాకుళం పరిధిలోని నైరా వ్యవసాయ కళాశాలను ఏఎన్‌జీఆర్‌ఏయూ ఉప కులపతి డా.పీవీ సత్యనారాయణ సోమవారం సందర్శించారు. కళాశాల అసోసియేట్‌ డీన్‌ డా.డి.చిన్నంనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల విద్యాభ్యాసం, కళాశాలలోని విద్యా వాతావరణం తదితర అంశాలపై వివరించారు. అనంతరం కళాశాలలో వివిధ విభాగాలు, సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఓఎస్‌ఏ డా.ఎస్‌.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

అలరించిన నృత్య ప్రదర్శన

శ్రీకాకుళం కల్చరల్‌: న్యూఢిల్లీలో ఉన్నటువంటి 530 సంవత్సరాల చరిత్ర కలిగిన అద్భుతమైన చారిత్రక కట్టడం నీమ్రానా ఫోర్ట్‌ ప్యాలెస్‌లో నగరానికి చెందిన ప్రఖ్యాత నాట్య గురువు రఘుపాత్రుని శ్రీకాంత్‌ శిష్యుడు రామ కౌండిన్య కూచిపూడి నాట్యం ప్రదర్శించి ఆహుతులను అలరించారు. నీమ్రానా ఫోర్ట్‌ ప్యాలెస్‌ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం రామ కౌండిన్య కొలువై ఉన్నాడే, గోవర్ధనగిరి ధార, వినరోభాగ్యము విష్ణుకథ అను కూచిపూడి నాట్య అంశాలను ప్రదర్శించి విదేశీ పర్యాటకులను అలరించారు. మన రాష్ట్రం నుంచి రామ కౌండిన్య ఒక్కరికే ఆ ఫోర్ట్‌ ప్యాలెస్‌లో నృత్య ప్రదర్శన చేసే అవకాశం వచ్చింది. కార్యక్రమం అనంతరం ఆయనను నీమ్రానా ఫోర్ట్‌ ప్యాలెస్‌ అధినేత అమన్‌నాథ్‌, ఫోర్ట్‌ ప్యాలెస్‌ జీఎం అంకుష్‌లు సత్కరించారు.

అప్పుడు హామీలిచ్చి.. ఇప్పుడు అణచివేస్తారా..?

ఇచ్ఛాపురం రూరల్‌: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విజయవాడలో నిరసన వ్యక్తం చేస్తే వారిపై కూటమి ప్రభుత్వం లాఠీచార్జ్‌ చేయించడం ఎంత వరకు సబబు అని ఎమ్మెల్సీ నర్తు రామారావు ప్రశ్నించారు. ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరితే.. ఇంత దౌర్జన్యం చూపడం ఏమిటని నిలదీశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యోగులు తమ గొంతు వినిపించడమే నేరమా అని ప్రశ్నించారు. వర్షాలకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. గత ఏడాది వచ్చిన మోంథా తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు నయా పైసా కూడా పరిహారం అందివ్వలేదని, అప్పటి బాధితులకు సైతం పరిహారం అందివ్వాలని కోరారు.

ఫ్యాన్ల ఏర్పాటుకు నిర్ణయం

అరసవల్లి: ‘శ్రీసూర్యనారాయణా మేలుకో...’ అన్న కథనంపై దేవదాయ శాఖాధికారులు స్పందించారు. సోమవారం ‘సాక్షి’లో భక్తుల మనోభావాలు దెబ్బతినే వ్యవహారాలపై ప్రచురించిన కథనానికి ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ స్పందించి సూపరింటెండెంట్‌ కె.వెంకటేశ్వరరావును ప్రసాదాల విభాగానికి వెళ్లి పరిస్థితులపై చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లుగా సమాచారం. ఈమేరకు సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు ప్రసాదాల తయారీ విభాగానికి వెళ్లి.. లడ్డూలను ఆరబెట్టేందుకు వీలుగా అదనంగా ఫ్యాన్లును ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టనున్నట్టుగా వివరించారు.

● ఎమ్మెల్సీ నర్తు రామారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement