● మత్స్యకారులకు గడ్డుకాలం
● చిక్కని సముద్ర సంపద
● తుఫాన్ హెచ్చరికలతో ఇంటికే పరిమితమవుతున్న వైనం
వజ్రపుకొత్తూరు:
సముద్రంలో చేపల వేట నిషేధం ముగిసి 90 రోజులు దాటింది. కానీ మత్స్యకారులు ఈ కాలంలో వేటకెళ్లి సంతృప్తిగా ఇంటికొచ్చిన రోజులు అందులో సగం కూడా లేవంటే అతిశయోక్తి కాదు. సంద్రంలో ఏ మాత్రం అలజడి రేగినా గంగపుత్రుల వేటపై నిషేధం అమలవుతుంది. దీంతో వీరు ఇంటికే పరిమితమవుతున్నారు. పోనీ వేటకెళ్లిన సందర్భంలో మత్స్య సంపద దొరుకుతుందా.. అంటే అదీ లేదు. పెద్ద పెద్ద బోట్లపై వేటకు బయల్దేరుతున్న పొరుగు రాష్ట్రాల మత్స్యకారులతో చిన్న చిన్న బోట్లపై వెళ్తున్న మన గంగపుత్రులు పోటీ పడలేకపోతున్నారు. వరుసగా ఎదురవుతున్న వేట నిషేధాలకు తోడు డీజిల్ ఖర్చులకు కూడా రాని చేపల వేటలతో వీరు అలసిపోతున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలో సుదీర్ఘంగా విస్తరించి ఉన్న తీరం వెంబడి 2.10లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. ఇందులో 16,569 మంది నిత్యం సముద్రంలో చేపల వేటతోనే తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఐతే ఏటా రెండు నెలలు మత్స్య సంపద పునరుత్పత్తి కారణంగా చేపల వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది. ఈ రెండు నెలల కాలంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరు. సముద్రంలో చేపల సంతానోత్పత్తి పెరగడంతో పాటు అప్పటికే ఉన్న మత్స్య సంపద మరింతగా పెరుగుతుంది. ఐతే సముద్ర తీరం వెంబడి ఏర్పాటవుతున్న పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య వ్యర్థాలను సముద్ర జలాల్లో వదిలేస్తుండడంతో మత్స్య సంపద ఉనికి కోల్పోతోంది. తమిళ జాలర్లు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో మరబోట్లుతో స్వైర విహారం చేస్తున్నారు. వీరి వద్ద సన్న పిల్ల సైజు నుంచి పెద్ద పెద్ద చేపలు పట్టే వలలు ఉండడంతో వీరు మత్స్య సంపదను కొల్లగొట్టడంతో మన గంగపుత్రులు లబోదిబోమంటున్నారు.
నిర్మానుష్యంగా సముద్ర తీరం
చేపల వేట నిషేధం ముగిసిన తర్వాత స్థానిక మత్స్యకారులతో సందడిగా ఉండాల్సిన సముద్ర తీరం గంగపుత్రులు లేక నిర్మానుష్యంగా ఉంది. చేపల వేటకు వెళ్లినా సముద్రంలో చేపలు లేకపోవడంతో రెక్కలు కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోవడంతో మత్స్యకారులు సముద్ర తీరానికి రావడానికి కూడా ఇష్ట పడడం లేదు. జిల్లాలో 193 కిలోమీటర్ల తీర ప్రాంతం 11 మండలాల్లో విస్తరించి ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, సంతబొమ్మాళి, పోలాకి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం తదితర మండలాల్లో చేపల వేట చేసి బతుకుతున్న మత్స్యకారులు రెక్కాడితే కానీ డొక్కాడని వారి కుటుంబాలను పోషించడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతూ అప్పు ల పాలవుతున్నారు. వైఎస్సార్ సీపీ హయాలో మూలపేట పోర్టు, ఫిషింగ్ జెట్టీలు, హార్బర్ల నిర్మాణాలు మొదలయ్యాయి. కానీ ప్రభుత్వం మారాక అవన్నీ మూలకు చేరడంతో మత్స్యకారుల
అప్పుల పాలవుతున్నాం
సముద్రంలో ఎంత దూరం వెళ్లినా చేపలు దొరకడం లేదు. వలలు వేసి సముద్రం నీటిలో లాగడం వల్ల రెక్కల కష్టం తప్ప ఏమీ మిగలడం లేదు. దీంతో రోజు వారీ ఇంటి దగ్గర ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుంటున్నాం. ఈ లోగా ఆరోగ్యం ఏమైనా సుస్తీ చేస్తే ఆ అప్పు మరింత పెరుగుతుంది.
– సీహెచ్.నీలయ్య, మత్స్యకారుడు, మంచినీళ్లపేట
డీజిల్ ఖర్చు రావడం లేదు
వేటకు వెళితే చిన్న చిన్న చేపలు తగుతుతున్నాయి. అవి ఆశించిన ధరకు పోవడం లేదు. ఐదారుగురం కలిసి వేటకు వెళితే కనీసం డీజిల్ ఖర్చులు దాటడం లేదు. తమిళ జాలర్లు, మర బోట్ల వల్ల సముద్రంలో మత్స్య సంపద లేకుండా పోతుంది. వేటలో వారు ఉపయోగించే సామగ్రి మా వద్ద లేదు. ప్రభుత్వం వేట నిషేధ భృతి ఇవ్వడంతో పాటు ఆధునిక వేట సామగ్రి సబ్సిడీపై అందించాలి.
– జుత్తు చిన్నారావు, మత్స్యకారుడు, భావనపాడు


