ఆదిత్యుని సాక్షిగా ల్యాండ్‌ వార్‌ | - | Sakshi
Sakshi News home page

ఆదిత్యుని సాక్షిగా ల్యాండ్‌ వార్‌

Sep 21 2026 12:26 AM | Updated on Sep 21 2026 12:26 AM

భూబదలాయింపు ద్వారా ఆలయానికి చెందనున్న భూములకు ఎన్‌ఓసీ ఇవ్వాలంటూ ఒత్తిళ్లు

ఈ విషయంపై ఈఓ ప్రసాద్‌పై కలెక్టర్‌ ఆగ్రహం

సెలవులోకి వెళ్లిపోనున్న ఆలయ ఈఓ ప్రసాద్‌

అరసవల్లి: అరసవల్లిలో భూ బదలాయింపుల అంశం వివాదాలకు దారి తీస్తోంది. ఈ వ్యవ హారంలో రూ.లక్షల్లో చేతులు మారినట్లుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ప్రతి అంశం చర్చకు దారి తీస్తోంది. అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి జిల్లాలో పలు చోట్ల సుమా రుగా 102 ఎకరాల భూములున్నాయి. అయితే ఇందులో సుమారుగా 57 ఎకరాల భూములు వంశపారంపర్య అర్చకుల జీతభత్యాలకు బదులుగా అప్పట్లో అధికారికంగా కేటాయించారు. అయితే ఆలయానికి భక్తుల ద్వారా ఆదాయ వనరులు పెరగడంతో గత ప్రభుత్వ హయాంలోనే డిప్యూటీ కమిషనర్‌ హోదా పెరిగిన సంగతి విదితమే. అయితే ఇంకా అభివృద్ధి చేయాలనుకున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో అభివృద్ధికి అవసరమైన భూములను గుర్తించి, ఆయా ప్రైవేటు భూ యజమానుల నుంచి వాటిని తీసుకుని, ప్రత్యామ్నాయంగా ఆలయ భూములను బద లాయింపు చేసేలా (ల్యాండ్‌ టు ల్యాండ్‌) గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ భూ లావాదేవీలను జేబులు నింపుకునే వ్యవహారాలుగా మారిపోయాయనే విమర్శలు వినిపించాయి. ఏకంగా ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ అంతా తానై భూ బదలాయింపులు చేసి తద్వారా లాభపడినట్లుగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.

ప్రైవేటు యజమానుల నుంచి మొత్తం 1.22 ఎకరాల భూములను ఆలయ అవసరాలకు తీసుకుంటూనే ఆలయానికి ఎంతో విలువైన ప్రాంతా ల్లో ఉన్న కీలక భూములను కట్టబెట్టేలా నిర్ణయాలను తీసుకున్నారు. ఇదే ఇప్పుడు వివాదాంశమైంది. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు రా మ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌ల ఆధ్వర్యంలోనే ఇలా ఆలయానికి చెందిన కీలక భూముల బదలాయింపునకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చేసింది. దీంతో భవిష్యత్‌లో అరసవల్లికి చెందిన చిన్నతోట, పెద్దతోటలతో పాటు మరిన్ని విలువైన స్థలాలు ఇక ప్రైవేటు పరం కానుండడం లాంఛనమే అయ్యింది.

ఎన్‌ఓసీ కోసం పట్టు

భూబదలాయింపు విధానంలో భాగంగా స్థానికులైన సలుగు శేఖర్‌కు చెందిన 12 సెంట్ల భూమికి బదులుగా మెయిన్‌ రోడ్డులో ఉన్న సర్వే నంబర్‌ 485/2 లో 9.50 సెంట్లు (నందల తయారీ స్థలం) ఇవ్వడానికి, అలాగే పెద్దింటి పూర్ణ, బమ్మిడి కృష్ణారావులకు చెందిన 46 సెంట్లను తీసుకుని వారికి సర్వే నంబర్‌ 89/6లోని 37 సెంట్ల భూమితో పాటు వప్పంగి గ్రామ పరిసరాల్లో ఉన్న 592 గజాల స్థలాలను బదలాయింపుగా ఇచ్చేలా నిర్ణయించారు. అలాగే మద్దుల సూర్యనారాయణ, రమేష్‌ చక్రవర్తిలకు చెందిన 18 సెంట్ల స్థలానికి బదులుగా ఆలయానికి చెందిన చిన్నతోటలోని 14 సెంట్లను, అలాగు గంగు రామన్న కుటుంబానికి చెందిన 46 సెంట్ల స్థలానికి బదులుగా పెద్దతోటలోని 40 సెంట్లను బదలాయింపుగా ఇచ్చేసేలా దేవదాయ శాఖ కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు కూడా వచ్చేశాయి. ప్రైవే టు వాళ్ల నుంచి మొత్తం 1.22 ఎకరాల భూములను ఆలయానికి చెందనుండగా, ఆలయానికి చెందిన 1.10 ఎకరాల విలువైన భూములు ఆ యా ప్రైవేటు భూయజమానుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఆలయానికి చెందనున్న 1.22 ఎకరాల భూములను దేవదాయ శాఖ చట్టం 30/87 ప్రకా రం ప్రోపర్టీ రిజిస్టర్‌లో ఎంటర్‌ కావాల్సి ఉంది.

ఇంతలోనే కొత్తగా ‘స్వదేశ్‌ దర్శన్‌ 2.0’ పేరిట ప్రతిపాదనలు తెరమీదకు రావడంతో ఆలయ ఈఓ ప్రసాద్‌ చిక్కుల్లో పడ్డారు. స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద అరసవల్లి ఆలయ పరిసరాల అభివృద్ధితో పాటు అరసవల్లి సన్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను, అలాగే డచ్‌ భవనం, నాగావళి రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి కోసం రూ.107.94 కోట్లతో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రతిపాదించగా ఇటీవలే కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు ఈ స్కీం నిధులతో నిర్మాణాలను ఆలయ భూముల్లోనే కట్టాలంటే బదలాయింపు ద్వారా ఆలయానికి సమకూరిన 1.22 ఎకరాల భూములకు దేవదాయ శాఖ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవడం తప్పనిసరి. అయితే ఈ ప్రక్రియ మరింత వేగవంతమయ్యేందుకు నేరుగా కలెక్టర్‌ రంగంలోకి దిగి ఎలాగైనా ఎన్‌ఓసీ ఇవ్వాలంటూ ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌పై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో ఒక దశలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆలయ భూములపై భవనాల నిర్మాణాలు చేయాలన్నా ఎన్‌ఓసీ ఇవ్వాలన్నా రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్‌ మాత్రమే అధికారం ఉండడంతో ఈ ఒత్తిడి ఆలయ ఈఓ ప్రసాద్‌ను తాకింది. దీంతో ఆయన ఏకంగా సెలవుపై వెళ్లిపోయేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

మరోవైపు భూ బదలాయింపుపై వస్తున్న ఆరోపణలపై కూడా విచారణ వేయనున్నారని విశ్వసనీయ సమాచారం. అరసవల్లి ఆలయ ఈఓ సోమవారం నుంచి సెలవులోకి వెళితే ఈ స్థానంలో విఽశాఖపట్నం డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న సుజాతకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం ఊపందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement