శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, పట్టణ ప్రజలకు నష్టదాయకమైన మున్సిపల్ సేవల ప్రైవేటీకరణ ఆపాలని, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, నగర అధ్యక్షుడు అరుగుల గణేష్ డిమాండ్ చేశారు. స్ట్రీట్ లైటింగ్ టెండర్లు ప్రక్రియ వెంటనే నిలిపివేయాలని, పట్టణాలలో పౌరసేవలు ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో వాటర్ సప్లయ్, వీధి లైట్లు, పార్కులు, రోడ్లు, వాహనాలు తదితర 14 కీలక విభాగాలను, పౌరసేవలను పీపీపీ పేరిట ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు తప్పదన్నారు. కోటిన్నర మంది పట్టణ ప్రజలపై యూజర్ చార్జీల భారం పడుతుందన్నారు. ప్రజా సంక్షేమాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించి మున్సిపల్ కార్మికులు, పట్టణ ప్రజల్ని కష్టాలపాలు చేసేందుకే మున్సిపల్ సేవల ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మున్సిపాలిటీలు వసూలుచేస్తున్న పన్నులన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాగేసుకుంటున్నాయని దుయ్యబట్టారు. ఆ నిధులు ఇవ్వకపోవడం వల్లే మున్సిపాలిటీలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. మున్నిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించి హక్కులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగర కమిటీ నాయకులు ఏ.జ్యోతిప్రసాద్, ఎం.రాఘవ, ధనాల చిట్టి, ఆర్.యుగంధర్, జె.మాధవి, ఎన్.పార్వతి, వి.సరోజ, డి.గంగ తదితరులు పాల్గొన్నారు.


