ఉపాధి చెరువులో మట్టి దోపిడీ | - | Sakshi
Sakshi News home page

ఉపాధి చెరువులో మట్టి దోపిడీ

Sep 18 2026 12:51 AM | Updated on Sep 18 2026 12:51 AM

సంతబొమ్మాళి: అధికార పార్టీ నాయకులు సహజ వనరులను కొల్లగొడుతున్నారు. ఒక వైపు కంకరను తరలించుకు పోగా.. మరో వైపు మట్టిని కూడా వదలకుండా అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే హనుమంతునాయుడు పేట పంచాయతీ చిన్నకేశనాయుడు పేట గ్రామంలో ఉపాధి చెరువు మట్టిని అక్రమంగా గురువారం పట్టపగలు తరలించుకుపోయారు. గ్రామంలోని కొత్తచెరువులో ఏటా లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో పనులు చేపడుతున్నారు. పనుల్లో భాగంగా ఉపాధి కూలీలు చెరువులోని మట్టిని గట్లపై పోసి లెవలింగ్‌ చేశారు. ఈ మట్టిపై కొందరు టీడీపీ నాయకుల కన్ను పడింది. దీంతో యంత్రాలు వినియోగించి ట్రాక్టర్ల ద్వారా మట్టిని పట్టపగలు తరలించుకుపోతున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ మట్టిని సుమారు రూ.400లకు విక్రయిస్తున్నట్లు ఉపాధి హామీ కూలీలు తెలిపారు. పట్టపగలే ట్రాక్టర్లతో మట్టి తరలిస్తుండటాన్ని గమనించిన స్థానిక యువకులు అక్కడకి చేరుకుని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొంత సమయం మట్టి తరలింపు నిలిచిపోయింది. అనంతరం యువకులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మళ్లీ యథేచ్చగా మట్టి తరలించారు. అధికారులకు తెలిసిన చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉపాధిహామీ ఏపీఓ పంగ నరసింహమూర్తిని సంప్రదించగా ఉపాధిహామీ చెరువు మట్టిని తరలించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. స్థానిక వీఆర్వో సాయిని అడుగగా తన దృష్టికి రాలేదని, సమాచారం ఇస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement