ఆన్‌లైన్ రైల్వే టికెట్ పేరుతో ఏజెంట్ల మోసాలు
పాత టికెట్లను కరెక్షన్ చేసి ఫేక్
పీడీఎఫ్‌లు ఇస్తున్న వైనం
డమ్మీ పీఎన్‌ఆర్ నంబర్‌తో అమ్మకాలు
రైలెక్కాక కంగుతింటున్న ప్రయాణికులు
కి.మీ తక్కువతో అనుమానం
కోర్టులు చుట్టూ తిరగాల్సిందే..
ఫిర్యాదు చేస్తే చాలు
పండగలు, దూర ప్రయాణాల రద్దీని ఆసరాగా చేసుకొని కొందరు ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు దగాకోరు అవతారమెత్తుతున్నారు. ఐఆర్‌సీటీసీ పేరుతో నకిలీ పీడీఎఫ్ టికెట్లు సృష్టిస్తూ నిలువునా మోసం చేస్తున్నారు. చేతిలో కన్ఫర్మ్ టికెట్ ఉందనుకుని రైలెక్కుతున్న ప్రయాణికులు తీరా టీటీఈ తనిఖీల్లో అసలు గుట్టు తేలుతుండడంతో నిశ్చేష్టులవుతున్నారు. జిల్లావ్యాప్తంగా సాగుతున్న ఈ నకిలీ రిజర్వేషన్ల దందాపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. – శ్రీకాకుళం క్రైమ్
è పలాస సమీపంలోని ఒక ఇంటర్నెట్ సెంటర్‌లో ఒక ప్రైవేటు చిరుద్యోగి ట్రైన్‌లో ముంబై వెళ్లేందుకు ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకున్నాడు. తీరా ట్రైన్ ఎక్కాక అతని బెర్తులో వేరే వ్యక్తి కూర్చోవడం.. టీసీ అధికారి వచ్చి పీఎన్‌ఆర్ స్టేటస్‌లో అతని పేరుతో టికెట్ బుక్ అయినట్లే లేదని చెప్పడంతో ఖంగుతిన్నాడు.
è తాజాగా గార మండలానికి చెందిన ఒక వ్యక్తి ఈ ఏడాది అక్టోబర్‌లో కుటుంబంతో సహా తిరుపతి వెళ్లేందుకు ఒక ఇంటర్నెట్ సెంటర్ ఏజెంటు వద్దకు వెళ్లి ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకున్నాడు. అయితే పీఎన్‌ఆర్ స్టేటస్‌లో చూస్తే వేరేవారి పేరుతో బుక్ అయినట్లుండడం, వెంటనే ఏజెంట్‌ను సంప్రదిస్తే అవుతాయిలే అంటూ తిప్పించడంతో చేసేదేమీలేక ఎస్పీ గ్రీవెన్సులో గత వారం ఫిర్యాదు చేశారు. ఈ ఇంటర్నెట్ నిర్వాహకుడే మరో వ్యక్తి వద్ద సైతం రూ.12 వేలు రిజర్వేషన్ టికెట్లు ఇప్పిస్తానని నమ్మించి మోసగించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇలా జిల్లాలో ఇంటర్నెట్ సెంటర్లు నడుపుతున్న కొందరు ఏజెంట్లు రిజర్వేషన్ కన్ఫర్మ్ అయినట్లు డమ్మీ పీఎన్‌ఆర్ నంబర్ చూపించి టికెట్ల అమ్మకాలు చేస్తూ సామాన్యులను దోచేస్తున్నారు. వాస్తవానికి రైల్వే కౌంటర్లలో ఉన్న ధరకు రెట్టింపుగా అమ్మడమన్నదే ఒక నేరమైతే.. ఇలా ఫేక్ పీడీఎఫ్‌ల రూపేనా పనికిరాని రిజర్వేషన్ టికెట్లను ఇచ్చి ప్రజలను మోసగిస్తుండడం దారుణం. కేంద్రంలోని అతి పెద్ద వ్యవస్థగా పేర్కొనబడే రైల్వే శాఖను సైతం ఏమార్చుతున్నారంటే ఎంత పెద్ద నేరం చేస్తున్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి కేటుగాళ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పీఎన్‌ఆర్ స్టేటస్ చెక్ చేసుకోకుండా టికెట్లను తీసుకోరాదని రైల్వే, పోలీసు అధికారులు చెబుతున్నారు.
మోసగిస్తారు ఇలా.. !
నెట్ సెంటర్ ద్వారా ఆన్‌లైన్ రిజర్వేషన్ టికెట్లిచ్చే ఏజెంట్లు ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో ప్రయాణం అయిపోయిన పాత టికెట్లను (యూజ్డ్ పీడీఎఫ్) ఫొటోషాప్‌లో కరెక్షన్ చేస్తారు. వాస్తవానికి ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో మూడు రోజులయ్యాక పాత పీఎన్‌ఆర్ బుకింగ్ టికెట్లు సంబంధిత రైల్వే శాఖ తొలగిస్తుంది. ఈలోపే ఏజెంట్లు వాటిని డౌన్‌లోడ్ చేసి బుకింగ్ డేట్, జర్నీ డేట్, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం, ట్రైన్ పీఎన్‌ఆర్ నంబర్, బెర్త్, సీట్ల నంబర్లు, పేర్లు అన్నీ మన కుటుంబీకులవే ఉన్నట్లుగా మార్చేస్తారు. ఇది చూడడానికి ఒరిజినల్ మాదిరిగానే ఉంటుంది.
నిబంధనలు సడలించడంతో...
జిల్లాలోని కీలక రైల్వేస్టేషన్ల పరిధి పట్టణాల్లోను, మున్సిపాలిటీల్లోను రిజర్వేషన్ కౌంటర్‌లున్నా ప్రయాణికులు అత్యవసర సమయాల్లో టౌటింగ్ వ్యవస్థగా పిలువబడే ఏజెంట్ల వద్ద అధిక ధరలకు ఓ విధంగా చెప్పాలంటే బ్లాక్‌లో ఆన్‌లైన్ రిజర్వేషన్ టికెట్లు చేయించుకుంటారు. ఒకప్పుడు కేంద్ర రైల్వే విభాగం అధికారులు టౌటింగ్ యాక్ట్ కింద ఇలా అక్రమంగా టికెట్ల అమ్మకాలు జరుపుతున్నవారిపై కేసులు సైతం నమోదు చేసేవారు. మన జిల్లాలో అయితే ఒక్కో స్టేషన్‌కు 100 నుంచి 120 వరకు కేసులు బుక్కయ్యేవి. ఏడాదిన్నరగా నిబంధనలు సడలించడంతో ఇలాంటి దళారి ఏజెంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడమే కాక ఫేక్ పీడీఎఫ్ టికెట్ల పేరిట పనికిరాని రిజర్వేషన్ టికెట్లు ఇచ్చి దండిగా సొమ్ము కొల్లగొడుతున్నారు. జిల్లాకేంద్రంలోని డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనున్న దుకాణాన్ని నడుపతున్న వ్యక్తి, జీటీరోడ్డులోని ఒక క్లాత్‌షోరూం పక్కన దుకాణదారుడు సైతం ఇదే తరహా మోసాలకు పాల్పడుతున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులున్నాయి. వీరి బాధితుల్లో పోలీసులు, రైల్వే కౌంటర్‌లో పనిచేసేవారు సైతం ఉండడం గమనార్హం.
గత ఆగస్టు 24న నెట్ సెంటర్ ఏజెంట్ వద్దకు వెళ్లా. విశాఖపట్నం నుంచి తిరుపతి, తిరుపతి నుంచి విశాఖపట్నం అక్టోబరు 7, 10 తేదీలకు కుటుంబ సభ్యుల పేరిట బుక్ అయినట్లు పీడీఎఫ్ టికెట్లు ఇచ్చారు. 4 రోజుల తర్వాత వాటిని పరిశీలిస్తే విశాఖ నుంచి తిరుపతికి దూరం 313 కి.మీ ఉండడంతో అనుమానమొచ్చింది. వాస్తవానికి 786 కి.మీ ఉండాలి. పీఎన్‌ఆర్ స్టేటస్ చెక్ చేస్తే ఇన్‌వ్యాలిడ్ అని వచ్చింది. వేరేవారి పేర్లతో రిజర్వ్ అయినట్లు వచ్చాయి. వెంటనే తెలిసిన రైల్వే అధికారులను సంప్రదిస్తే ఫేక్ పీడీఎఫ్‌లతో మోసపోయానని తేల్చారు. దీంతో పోలీసులను ఆశ్రయించాను.
– బాధితుడైన ప్రైవేటు ఉద్యోగి,
గార మండలం
ఇటువంటి నేరాలపై టౌటింగ్ యాక్ట్, 143 సెక్షన్లు కింద కేసులు నమోదు చేస్తాం. ఫ్రాడ్ అని నిర్ధారణకొస్తే సైబర్ పోలీసులకు అప్పజెప్పాక సైబర్ క్రైమ్‌గా పరిగణిస్తారు. రిమాండ్‌కు పంపే వీలుంది. లేదంటే పూచీకత్తుపై 41 నోటీసు బెయిల్ ఇచ్చినా దాదాపు రెండేళ్లు కోర్టు ట్రయల్‌లో ఉంటుంది. ఆ రెండేళ్లు కోర్టు చుట్టూ తిరగాల్సిందే. రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సిందే. ఫిర్యాదు వచ్చిన వెంటనే ఇంటర్నెట్ సెంటర్‌ను, అందులో సిస్టమ్‌లను సీజ్ చేస్తాం. మళ్లీ సెంటర్‌ను తెరవాలంటే కోర్టు ఆర్డర్‌ను తెచ్చుకోవాలి.
– ఆర్పీఎఫ్ అధికారి,
శ్రీకాకుళం రోడ్డు
ఇలాంటి మోసాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తే చాలు.. ఫ్రాడ్ అని ఆర్పీఎఫ్ పోలీసులు నిర్ధారించాక మరోమారు లోకల్ పోలీసులతో విచారణ చేయిస్తాం. బాధితులు చేయాల్సిందల్లా విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్‌లను అడ్రస్ చేస్తూ మెయిల్‌లో గానీ, వ్యక్తిగతంగా గానీ ఫిర్యాదు చేయడమే. పారదర్శకంగా విచారణ జరిపి మోసగాళ్లపై టౌటింగ్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటారు.
– ట్రైనింగ్ స్కూల్ ఇన్‌చార్జి,
రైల్వే విభాగం


