గార : అందరికీ విద్య అందించటంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు అన్నారు. మంగళవారం వమరవల్లి ప్రభుత్వ డైట్‌లో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరం మనిషిని ఎంతటి ఉన్నత స్థానానికై నా తీసుకెళ్లగలదన్నారు. వయోజన విద్య ఉపసంచాలకుడు ముద్దాడ వెంకటరమణ మాట్లాడుతూ వయెజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1982 నుంచి వివిధ అక్షరాస్యతా కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ పేరుతో, రాష్ట్ర ప్రభుత్వం అక్షర ఆంధ్ర పేరుతో అక్షరాస్యతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ అక్షరాస్యత సాధన– సవాళ్లు పరిష్కారాలు’ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు, డిజిటల్ అక్షరాస్యత– అంతరాలు అవకాశాలు అనే అంశంపై నిర్వహించిన వ్యక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపాల్ ఏ.గౌరీశంకరరావు, డ్వామా ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డి.మనోరమ తదితరులు పాల్గొన్నారు.


