నరసన్నపేట: మాకివలసకు చెందిన బొంగు నిర్మల (45) అనే వివాహిత శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందింది. భర్తతో మనస్పర్థలు కారణంగా సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా వెంటనే కుటుంబ సభ్యులు గమనించి శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు నరసన్నపేట ఎస్సై బి.గణేష్ తెలిపారు. సోమవారం ఉదయం నరసన్నపేట బ్యాంకులో పని కోసం బండిపై తీసుకువెళ్లాలని నిర్మల తన భర్త లక్ష్మణరావును కోరగా, చిన్న అబ్బాయి బండి తీసుకువెళ్లాడని, వచ్చాక వెళ్దామని చెప్పిన కొద్ది సమయానికే క్షణికావేశానికి గురై నిర్మల ఆత్యహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నరసన్నపేట: ఉర్లాం గ్రామానికి చెందిన పసుపురెడ్డి ఈశ్వరరావు(53) ఈ నెల ఒకటో తేదీన అందిన గీతకార్మిక పింఛన్ డబ్బుతో మద్యం సేవించి ఇంటికి వెళ్తుండగా రాత్రి 7.30 సమయంలో రోడ్డుపై పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు నరసన్నపేట ఎస్సై బి.గణేష్ తెలిపారు. కుమారుడు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.


