బ్రాండెడ్ కానివే..
తనిఖీలు నామమాత్రం
జంక్ ఫుడ్స్ వద్దు..
రంగు చూసి మోసపోవద్దు..
బడికి వెళ్లడానికి ఓ చిప్స్ ప్యాకెట్.. ఇంటర్వెల్‌లో తినేందుకు ఓ చాక్లెట్.. మధ్యాహ్న భోజనం అయ్యాక మరో ప్యాకెట్.. ఓ రెండు పీరియడ్ల తర్వాత వచ్చే ఇంటర్వెల్‌లో పంటి కిందకు బిస్కెట్ ప్యాకెట్.. మళ్లీ ఇంటికి వచ్చాక ఇంకా ఏవేవో. సగటు విద్యార్థి ఒక రోజుకు తినే చిరు తిండి ఆ విద్యార్థి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రంగురంగుల ప్యాకెట్లు మార్కెట్‌ను ముంచెత్తుతుండడంతో వాటికి ఆకర్షితులై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొరవడిన అధికారుల పర్యవేక్షణ చిన్నారుల ప్రాణాంతకంగా మారుతోంది.
● మార్కెట్‌లో నాసిరకం చిరుతిళ్లు ● చిన్నారుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం ● కొరవడిన అధికారుల పర్యవేక్షణ
వజ్రపుకొత్తూరు రూరల్, సారవకోట:
చిరు తిండి పిల్లలకు అనారోగ్యం తెచ్చి పెడు తోంది. ఒకప్పుడు చిరుతిండి అంటే ఇంట్లో చేసుకు నే పిండి వంటలైన చుప్పులు, జంతికలు, అరిసె లు, చేగొడియాలు తినేవారు. ఇప్పుడు మాత్రం బయట దుకాణాల్లో విక్రయించే రంగు రంగుల చి ప్స్ ప్యాకెట్లు, చాక్లెట్స్, ఐస్ స్టిక్స్, కలర్ క్యాండీలు, కూల్‌డ్రింక్స్, కేక్‌లు అంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇవి కంటికి అందంగా, నోటికి రుచికరంగా ఉన్నా అవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కొన్నయితే ఏకంగా పిల్లల శరీర అవయవాలపై ప్రభావం చూపిస్తాయంటే అతిశయోక్తి కాదు. పాఠశాలలు, పలు కూడళ్లలో ఉన్న దుకాణాల్లో విక్రయించే తిను బండారాల నాణ్యతపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారు.
ఈ చిరుతిళ్లకు ఎక్కువగా ఆకర్షితులవుతున్నది చిన్నారులే. వైద్యుల అభిప్రాయం ప్రకారం అధిక మోతాదులో కృత్రిమ రంగులు, రసాయనాలు, చక్కెర, ఉప్పు కలిగిన ఆహార పదార్థాలతో పాటు కాలం చెల్లిన ఆహార పదార్థాలు తరచూ తీసుకోవ డం వల్ల జీర్ణకోశ సమస్యలు, ఊబకాయం, పోషకాహార లోపం, ఏకాగ్రత తగ్గడం, దంత క్షయం, ఫుడ్ పాయిజనింగ్, కేన్సర్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ఈ రంగు రంగుల ప్యాకెట్లలో బ్రాండెడ్ కానివే అధికంగా ఉన్నాయి. ప్యాకెట్ ఆకర్షణీయంగా తయారుచేసి విక్రయిస్తుండడంతో పిల్లలు, తల్లిదండ్రులు మోసపోతున్నారు. బ్రాండెడ్ కాని ఈ తినుబండారాలు పక్కనున్న ఒడిశా రాష్ట్రం నుంచి దళారులు కొనుగోలు చేసి గ్రామాల్లో విక్రయిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీ వారి తినుబండారాలు అమ్మితే ప్యాకెట్‌కు 50 పైసలు మాత్రమే కమీషన్ వస్తుంది. అదే లోకల్‌లో తయారు చేసే అన్‌బ్రాండెడ్ తినుబండారాలు విక్రయిస్తే ప్యాకెట్‌కు రూ పాయికి పైనే కమీషన్ వస్తుంది. దీంతో వ్యాపారులు నాసిరకం చిరుతిళ్లు కొనేసి విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు.
విచ్చలవిడిగా అమ్ముతున్న నాసి రకం తినుబండారాలను అరికట్టేందుకు అధికారుల తనిఖీలు నామమాత్రంగా ఉన్నాయి. ఆహార తనిఖీలు, పంచాయతీ తూనికలు, కొలతల శాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వీటి అమ్మకాలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలు ప్రకారం పాఠశాలల లోపల గానీ, పాఠశాలకు 50 మీటర్ల పరిధి లో గానీ ఎలాంటి జంక్ ఫుడ్స్, కూల్‌డ్రింక్స్, ఇతర హానికరమైన తినుబండారాలు అమ్మకూడదు. ఈ నిబంధనలను ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కఠినంగా అమలు చేస్తున్నాయి. మన వద్ద మాత్రం యథేచ్ఛగా అమ్ముతున్నారు.
జంక్ ఫుడ్‌కు అంతా దూరంగా ఉండాలి. రుచి, ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వివిధ రకాల రసాయనా లు, రంగులు వాడుతుంటారు. అలాంటి చిరుతిళ్లు తీసుకోవడం వల్ల పిల్లల్లో కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇదే కొనసాగితే అసిడీటీ, జీర్ణకోశం, పేగు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
– సుధారాణి, వైద్యులు, సారవకోట పీహెచ్‌సీ
రంగులు, రుచులకు అలవా టు పడితే ప్రమాదం తప్ప దు. మంచి ఆరోగ్యం కోసం పౌష్టికాహారం, తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. హానికరమైన జంక్ అండ్ ఆయిల్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
– కాస మనోహర్, అనస్థీషియా, ఇంటెన్సివ్ కేర్ నిపుణులు, వైద్యాధికారి, పలాస సీహెచ్‌సీ


