‘సార్ మీరే మా ధైర్యం..
వీడొద్దు స్థైర్యం’
కార్యకర్తల రుణం తీర్చుకోలేను
కష్టకాలంలో నా కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకున్నారు
కార్యకర్తల కృతజ్ఞత సభలో
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
కాశీబుగ్గ:
‘అక్రమ అరెస్టులతో నన్ను, నా కుమారుడిని జైలుకు పంపిన సందర్భంలో అహర్నిశలు శ్రమించారు. రేయింబవళ్లు 50 మంది చొప్పున డ్యూటీలు వేసుకుని మరీ నాతో ఉన్నారు. జైలుకు పంపినప్పుడు అండగా మేమున్నామంటూ మహిళలు సైతం ధైర్యంతో ముందుకొచ్చారు. కంటికి రెప్పలా కాచుకున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి మారుమూల గ్రామంలోని కార్యకర్త వరకు మద్దతుగా నిలిచారు.’ అంటూ మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. కక్ష పూరిత రాజకీయాలకు మనం పోవ ద్దని, ఓర్పుతో ప్రజల్లోకి వెళ్దామని పిలుపునిచ్చారు. ఆయన శనివారం తన స్వగృహంలో పార్టీ కార్యకర్తలతో జరిగిన కృతజ్ఞత సభలో మాట్లాడారు. అనుకోని ప్రమాదానికి తనతోపాటు కుమారుడిని అక్రమంగా జైలుకు పంపి, నియోజకవర్గ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయాలనే వెన్నుపోటు పార్టీ కుట్రలను కార్యకర్తలు ఐకమత్యంగా తిప్పికొట్టిన తీరు మరువలేనిదని ప్రశంసించారు. ఈ ఘటనతో కార్యకర్తల క్రమశిక్షణ, నిబద్ధత ఎలాంటిదో మరోసారి రుజువైందన్నారు.
ఎమ్మెల్యేకు థాంక్స్
‘నా అక్రమ అరెస్టుతో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకు కదిలివచ్చారు. ఆయన రాకతో ఈ ప్రాంతం ఆ రోజు ప్రజా ప్రభంజనాన్ని చూసింది. ఈ విధంగా అన్యాయమైన చర్యలకు పాల్పడి ఓ విధంగా వెన్నుపోటు పార్టీ ఎమ్మెల్యే శిరీష మంచి పనే చేశారు. అందుకు ఆమెకు కృతజ్ఞతలు’ అంటూ సీదిరి చురకలు అంటించారు. ఆ సమయంలోనూ జిల్లాలో పార్టీకి చెందిన నాయకులపై అక్రమ కేసులు బనాయించారని, చింతాడ రవిని బంధించారని, 27మందిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. తాజాగా అల్లు వెంకటరమణను ఏ4 ముద్దాయిగా జైలుకు పంపారని, పేరాడ తిలక్‌ను మెళియాపుట్టి తీసుకెళ్లి నిర్బంధించారని, ఎన్ని చేసినా తొణకని స్థైర్యం వైఎస్సార్ సీపీ కార్యకర్త నైజమని సీదిరి స్పష్టం చేశారు.
స్థానికంలో సత్తా చాటుదాం
ప్రస్తుతం ప్రజలు చీకటి పాలన చూస్తున్నారని, పాలనపై ప్రజలు విసిగిపోయారని, మరో రెండున్నరేళ్ల కాలం తర్వాత ప్రతి కార్యకర్త గౌరవంగా బతికే రోజు వస్తుందన్నారు. స్థానిక సంస్థలు ఎప్పుడు వస్తాయా? పాలకులకు తగిన బుద్ధి చెబుదామా అంటూ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపిద్దాం. అధినేతకు బహుమానంగా ఇద్దాం.. అంటూ సీదిరి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు ఎన్ని ధనుంజయరావు, హనుమంతు వెంకటరావు, ఉదయ్ కుమార్, పాలిన శ్రీనివాసరావు, ఉంగ సాయి,శిష్టు గోపీ, బమ్మిడి దుర్యో ధన, భాస్కరరెడ్డి, బి.చంద్రకళ, హేమంత్ కుమార్, కంచరాన చినబాబు, బోర బుజ్జి, తమ్మినాన శాంతారా వు, బి.హేమేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
‘సార్.. మీరు ముందుండి నడిపించండి. అన్యాయంగా అరెస్టు చేశారన్నది ప్రజలందరికీ తెలు సు. విద్యార్థులు, రాజకీయ విశ్లేషకులు, ఉద్యోగులు అందరూ మీ అరెస్టును వ్యతిరేకించారు. చివరికి న్యాయమే గెలిచింది. స్వచ్ఛంగా తిరిగి వచ్చారు. మీరే మా ఽధైర్యం. కాలం ఒకేలా ఉండదు. మనం మంచే చేశాం. ఇలాంటి తాటాకు చప్పుళ్లు మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీరే మా ధైర్యం.. ఆ స్థైర్యంతో మమ్మల్ని నడిపించండి. రానున్న స్థానిక ఎన్నికలలో ఫ్యాన్ ప్రభంజనం ఎలా ఉంటుందో చూపిస్తాం. ఆ గెలుపు ప్రేరణతో 2029లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా, మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తాం’ అంటూ మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఎదుట పార్టీ నాయ కులు, కార్యకర్తలు ముక్తకంఠంతో నినదించా రు. సభలో సీదిరి అప్పలరాజును సార్ అంటూ కార్యకర్తలు అభివర్ణించారు. ఇంతకీ ‘సార్’ అంటే సీదిరిలో తొలి అక్షరం ఎస్, అప్పలరాజును ఏఆర్‌గా వెరసి ఎస్‌ఏఆర్ అంటూ పిలవడంతో అందరి మోముల్లో నవ్వులు పూశాయి.


