కంచిలి: కుటుంబానికి అండగా ఉండే వ్యక్తి అనారోగ్యం బారిన పడడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కష్టాల్లో కూరుకుపోయింది. యుక్త వయస్సులోనే అరుదైన వ్యాధి రావడంతో వారి జీవితాల్లో అంధకారం ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. కంచిలి మండలంలోని బూరగాం గ్రామానికి చెందిన ధూపాన మాధవరావు అనే యువకుడికి ‘బోన్‌మ్యారో’ వ్యాధి సోకింది. సుమారు 5 నెలలు క్రితం దీన్ని వైద్యులు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం రూ.9 లక్షలు వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. ఈ సమస్య నుంచి కోలుకోవాలంటే సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు. అంత డబ్బు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఆ కుటుంబం ఆవేదనలో మునిగిపోయింది. దీంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమ పరిస్థితిపై దయతలచి ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే 63008 02750 నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు. కాగా బాధితుడు ధూపాన మాధవరావు హైదరాబాద్‌లోని ఒక నిర్మాణ కంపెనీలో ఉపాధి కూలీగా పనిచేసేవాడు. ఈ వ్యాధి రావడంతో అక్కడి నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చేశాడు.
● బోన్‌మ్యారోతో బాధపడుతున్న యువకుడు
● దాతల సాయం కోసం కుటుంబం ఎదురుచూపులు


