శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌పై అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదర్ సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రజాధరణను చూసి ఓర్వలేని తనంతో కూటమి ప్రభుత్వం చింతాడ రవిలాంటి వ్యక్తులపై అక్రమ కేసులు బనాయించడంతో పాటు తీవ్ర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన విద్యావంతుడు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న చింతాడ రవికుమార్ నోరు నొక్కేయాలనుకోవడం చంద్రబాబు అసమర్థ పాలనకు నిదర్శమని పేర్కొన్నారు. రవికుమార్‌తో పాటు ఆయన అనుచరులైన 20 మందిపై, అందులో ఆమదాలవలస కోర్టులో విధుల్లో ఉన్న దానేటి రామ్మోహనరావు అనే న్యాయవాదిపైన, ఎక్కడో పంజాబ్‌లో తన కూతురు వద్ద ఉన్న వ్యక్తిపై తప్పుడు కేసులు బనాయించడం అప్రజాస్వామికమన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష పూరిత చర్యల్లో భాగంగా చట్టాన్ని అక్రమ మార్గంలో వాడుకోవడం మానుకోవాలని హితవు పలికారు.


