నేడు పెన్షనర్ల వైద్య శిబిరం | - | Sakshi
Sakshi News home page

నేడు పెన్షనర్ల వైద్య శిబిరం

Jul 13 2026 12:58 AM | Updated on Jul 13 2026 12:58 AM

● అంత్యక్రియలు నిర్వహించిన భార్య

శ్రీకాకుళం కల్చరల్‌ : రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు శ్రీకాకుళం ఏపీ ఎన్జీవో హోంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రకాశరావు, జిల్లా అధ్యక్షుడు సోమసుందరరావు ఒక ప్రకటనలో తెలిపారు. జెమ్స్‌ హాస్పిటల్‌ సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరంలో బీపీ, షుగర్‌, ఈసీజీ, 2–డీ ఇకో టెస్టులు ఉచితంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. పెన్షనర్లంతా ఈహెచ్‌ఎస్‌ కార్డులతో వచ్చి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు

యాసిడ్‌ తాగి మహిళ ఆత్మహత్య

పొందూరు : మండల కేంద్రం పొందూరులో లావేటివీధికి చెందిన అల్లాడ సత్యవతి(45) ఆదివారం యాసిడ్‌ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సత్యవతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో మనస్తాపానికి గురై యాసిడ్‌ తాగడంతో వెంటనే కటుంబసభ్యులు రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యవతి మృతిచెందింది. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు జడ్జి జస్టిస్‌ గిరిధర్‌

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆలపాటి గిరిధర్‌ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు.ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులు పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనివెట్టి మండపంలో వేదాశీర్వచనం చేయించారు. ఆలయ విశిష్టతను వివరించి అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో ప్రొటోకాల్‌ అధికార సిబ్బంది పాల్గొన్నారు.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లీలావరప్రసాద్‌ మృతి

టెక్కలి: ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గుంట లీలావరప్రసాద్‌ (49) శనివారం రాత్రి మృతిచెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. టెక్కలి మండలం శ్యామసుందరాపురం గ్రామంలో లీలావరప్రసాద్‌ భౌతికకాయానికి భార్య మాధవి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. ఈయన సీనియర్‌ జర్నలిస్టుగా, రచయితగా, విశ్లేషకునిగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సుపరిచుతులు. ఈయన రచనల్లో సిక్కోలు రాజకీయ చరిత్ర పుస్తకం ఎంతగానో ఆదరణ పొందింది. ఉత్తరాంధ్ర జర్నలిజం ఆవిర్భావం, వికాసం, పయనం, ఉత్తరాంధ్ర సాహితి శిఖరాలు, వర్క్‌ కండీషన్స్‌, జాబ్‌ శాట్సిఫికేషన్‌ అండ్‌ జర్నలిస్ట్‌, ఏ స్టడీ ఆఫ్‌ ప్రింట్‌ మీడియా ఇన్‌ విశాఖ, కళింగాంధ్ర కలం యోధులు, సిక్కోలు రాజకీయ చరిత్ర తదితర రచనలు చేశారు. పలు పత్రికల్లో 300కు పైగా వ్యాసాలు రాసి నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. లీలావరప్రసాద్‌ మృతి పట్ల టెక్కలికి చెందిన సాహిత్య సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు జి.వి.రెడ్డి మాస్టారు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.

ట్రాక్టర్‌ బోల్తా పడి వ్యక్తి మృతి

నరసన్నపేట: నడగాం –గొనబుపేట మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిపై ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో పశ్చిమబెంగాల్‌కు చెందిన షేక్‌ ఇబ్రహీం(30) మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు మండలంలో ఆర్‌డీఎస్‌ఎస్‌(విద్యుత్‌ ప్రత్యేక లైన్‌) పనులు చేస్తున్నారు. శనివారం పనులు ముగించిన అనంతరం రాత్రి మద్యం సేవించి ట్రాక్టర్‌పై వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికులు గమనించి గాయపడిన షేక్‌ ఇబ్రహీంను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోదరుడు షేక్‌ ఇవాదుల్‌ ఆశిన్‌ ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఎస్సై–2 లక్ష్మినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement