● సీఎంఆర్ సేకరణలో స్కామ్ జరిగినట్లు ఆరోపణలు
● పెందుర్తి గోడౌన్‌కు వెళ్లింది కస్టమ్ మిల్లింగ్ రైస్ కాదని అనుమానాలు
● హెడ్ ఆఫీసు నుంచి వచ్చిన ప్రత్యేక తనిఖీ బృందం
● గండం నుంచి గట్టెక్కేందుకు బడా నేతను ఆశ్రయించిన పలువురు మిల్లర్లు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
కస్టమ్ మిల్లింగ్ రైస్.. అంటే రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించి, ఆ మిల్లర్లు ఆడించిన బియ్యంను ప్రభుత్వం ఈ రూపంలో తీసుకుంటుంది. ఈ సీఎంఆర్ అప్పగింతలో పెద్ద కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎంఆర్‌కు బదులు పీడీఎస్ బియ్యం ఇచ్చారా ? వాటాల పంపకం తేడాతో ఉన్నతాధికారులకు ఉప్పు అందిందా? ఆగమేఘాల మీద విజయవాడ నుంచి ప్రత్యేక బృందం తనిఖీల కోసం వచ్చిందా? ఇప్పుడా బృందం సంబంధిత మిల్లులను తనిఖీ చేస్తుందా? అవినీతి బాగోతం బయటపడకుండా పెద్దలు లాబీయింగ్ చేస్తున్నారా? అంటే అవునని మిల్లర్ల వర్గాల ద్వారా తెలుస్తోంది.
జిల్లాలో 36 మిల్లుల నుంచి సీఎంఆర్‌ను అప్పగించేందుకు పెందుర్తిలోని ఒక గోడౌన్‌కు ట్యాగ్ చేశారు. ఈ మిల్లులు ఆడిన ధాన్యాన్ని ఆ గోడౌన్‌కు తరలించాలి. ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని 36 మిల్లుల నుంచి 700 లారీల సీఎంఆర్‌ను పెందుర్తి గోడౌన్‌కు పంపించేలా ట్యాగ్ చేసినట్టు తెలిసింది. ఒక్కో లారీలో 29 టన్నులు ఉండాల్సి ఉంది. అయితే, జిల్లా నుంచి కాకుండా పెందుర్తి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పీడీఎస్ బియ్యాన్ని సేకరించి, ఆ బియ్యాన్ని సీఎంఆర్‌గా చూపించి గోడౌన్‌కు అందజేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా కొందరు అధికారులు, కొందరు మిల్లర్లు కుమ్మకై ్క ఈ బాగోతం నడిపినట్టు అనుమానాలు ఉన్నాయి.
పక్కాగా తనిఖీలు..
ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా తేడా వచ్చిందో గానీ అవినీతి బాగోతంపై మాత్రం ఉన్నతాఽధికారులకు ఉప్పందించినట్లు సమాచారం. దానిలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన అమరావతి హెడ్‌ఆఫీస్ నుంచి సీనియర్ అధికారి ఆధ్వర్యంలో డీఎం కేడర్ అధికారులు జిల్లాకు వచ్చి తనిఖీలు చేస్తున్నారు. సాధారణ తనిఖీలైతే డీఎం స్థాయి కాకుండా మిగతా సిబ్బంది శాంపిల్ సర్వే చేస్తారు. కానీ, డీఎం స్థాయి అఽఽధికారులు జిల్లాకొచ్చి తనిఖీ చేస్తున్నారంటే మామూలు విషయం కాదని అర్థం. ముఖ్యంగా పెందుర్తి గోడౌన్‌కు పంపించాల్సిన 36 మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నట్టు తెలిసింది. పనిలో పనిగా మిగతా వాళ్లకు అనుమానం రాకుండా ఉండటానికి మిగతా మిల్లుల్లోని సీఎంఆర్ డెలివరీపై కూడా తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం.
● అమరావతి హెడ్ ఆఫీస్ నుంచి సీనియర్ అధికారి ఆధ్వర్యంలో వివిధ జిల్లాలకు చెందిన ఎనిమిది మంది డీఎం కేడర్ అధికారులు జిల్లాకు వచ్చి తనిఖీలు చేస్తున్నారు.
● పెందుర్తి గోడౌన్‌కు ట్యాగ్ చేసిన 36మిల్లుల్లో బియ్యం ఆడిన వివరాలతో పాటు విద్యుత్ బిల్లులను చెక్ చేసినట్టు తెలిసింది. ఆ స్థాయిలో మిల్లింగ్ చేస్తే రావాల్సిన విద్యుత్ బిల్లు ఎంత? సాధారణంగా వారికొచ్చిన విద్యుత్ బిల్లు ఎంత? అనే తేడాను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
● ఇక్కడి నుంచి వెళ్లినట్టు చూపించిన 700 లారీల జియో ట్యాగ్‌ను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఈ 700 లారీల్లో జిల్లాలోని మడపాం టోల్‌గేట్, భోగాపురం టోల్‌గేట్ మీదుగా వెళ్లాయో లేదో తెలుసుకునేలా ట్రాక్ చేసినట్టు తెలియవచ్చింది.
● వస్తున్న ఆరోపణల మేరకై తే ఆ లారీలు భోగాపురం, మడపాం టోల్‌గేట్‌ల వద్ద రికార్డు కానట్టు వినిపిస్తోంది. ఇవన్నీ పెందుర్తి చుట్టు పక్కల మండలాలు, ఆ జిల్లా పరిధిలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లారీలుగా అనుమానాలు ఉన్నాయి.
రూ.4 కోట్లుపై మాటే..!
ఆ జిల్లాల్లో దొరికే పీడీఎస్ రైస్‌ను ఇక్కడి నుంచి సీఎంఆర్‌గా పంపించినట్టు చూపించి, ఫైలు క్లోజ్ చేశారన్న వాదనలు ఉన్నాయి. ఆ విధంగా పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నట్టు తెలిసింది. ఒక్కో కిలో దగ్గర పీడీఎస్ రైస్‌కు, సీఎంఆర్ రైస్‌కు రూ.20వరకు తేడా ఉంటుంది. ఈ లెక్కన క్వింటాకు రూ. 2వేలు, టన్నుకి రూ. 20వేలు, లారీకి(29టన్నులు) రూ. 5.80లక్షలు, 700 లారీల అంటే రూ. 4కోట్ల పైమాటే. అయితే, ఇందులో ఎంత వరకు పీడీఎస్ రైస్ ఉందో, కొంతైనా సీఎంఆర్ ఉందో తెలియాల్సిన అవసరం ఉంది. తనిఖీలు జరుగుతుండటంతో మిల్లర్లు గమ్మున ఉన్నారు. ప్రతి రోజూ జరిగే వ్యవహారాలు, కార్యకలాపాలపై గ్రూపుల్లో పోస్టులు పెట్టే మిల్లర్లు ప్రస్తుతం సైలెంట్ అయి పోయారు. మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా లాబీయింగ్ చేస్తున్నారు. తమకు అన్ని రకాలుగా అండగా ఉండే పెద్ద నేతను ఇప్పటికే సంప్రదించి, దీన్ని నుంచి ఎలాగైనా గట్టెక్కెలా చూడాలని చక్కర్లు కొడుతున్నట్టు తెలిసింది.


