● ఓ విద్యా సంస్థలో విద్యార్థినుల ఫొటోల మార్ఫింగ్
● తల్లిదండ్రుల ఫిర్యాదుతో బయటపడిన వైనం
● కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం సమీపంలోని ఓ విద్యా సంస్థలో కొందరు విద్యార్థులు చేసిన అకృత్యాలు బయటపడ్డాయి. దీంతో విద్యార్థులంతా కాలేజీ ప్రాంగణంలోనే సి–బ్లాక్ వద్ద గురువారం భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. వారి తల్లిదండ్రులకు కూడా విషయం తెలియడంతో కాలేజీకి వచ్చి నినాదాలు చేశారు. రూరల్ పోలీసులు వచ్చి పరిస్థితి సద్దుమణిగించారు.
ఏం జరిగిందంటే..
కాలేజీలో కొన్ని రోజుల కిందట విద్యార్థుల సమ క్షంలో ఓ కార్యక్రమం జరిగింది. కొందరు విద్యా ర్థులు డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిల ఫొటోలు తీసి సాంకేతిక సాయంతో వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేశారు. ఆ ఫొటోలను ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో కాలేజీకి నిత్యం బస్సులో వచ్చే ఓ అమ్మాయికి ఆమె మార్ఫింగ్ చిత్రం ఓ అబ్బాయి సెల్‌ఫోన్‌లో కంట పడింది. దీంతో ఆమె నిశ్చేష్టురాలై ఇంటిలో విషయం చెప్పింది. వారు ఆ అబ్బాయి వద్దకు వెళ్లి చిత్రాలు డిలీట్ చేయించారు. కానీ కాలేజీలో చాలా మంది అమ్మాయిల ఫొటోలు ఇలాగే మార్ఫింగ్ చేసి షేర్ చేసిన వాస్తవం తెలిసింది. దీంతో వారు వెంటనే కాలేజీ యాజమాన్యాన్ని అప్రమత్తం చేశారు. దీనికి కారణమైన విద్యార్థికి టీసీ ఇచ్చేశామని, మరో నలుగురికి కూడా వారం కిందట టీసీలు ఇచ్చామ ని తెలిపారు. దీనిపై కాలేజీ యాజమాన్య ప్రతినిధులు గురువారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వదంతులు నమ్మవద్దని ఓ ప్రకటన విడుదల చేశారు.


