హైవే.. తనిఖీలకు నో వే..! | - | Sakshi
Sakshi News home page

హైవే.. తనిఖీలకు నో వే..!

Feb 5 2026 7:45 AM | Updated on Feb 5 2026 7:45 AM

హైవే.

హైవే.. తనిఖీలకు నో వే..!

రణస్థలం: జాతీయ రహదారిపై ఇసుక బళ్లు దర్జాగా దూసుకెళ్తున్నాయి. అక్రమమా, సక్రమమా అని అడిగే నాథుడు లేకపోవడంతో హైవే వెంబడి హారన్‌ కొట్టుకుంటూ బళ్లు రంకెలేస్తున్నాయి. నాగావళి, వంశధార పరివాహక ప్రాంతాల నుంచి నిత్యం ఇసుక తవ్వుకుంటున్న వారు వందలాది లారీల్లో ఆ ఇసుకను విశాఖ తదితర ప్రాంతాలకు సులువుగా తరలించుకుంటున్నారు. సాధారణంగా సుదూర ప్రాంతాలకై తే ప్రభుత్వ నిర్దేశిత రుసుం చెల్లించి అనుమతులు పొందాలి. కానీ అనుమతులు ఉన్నాయో లేవో పరిశీలించే దిక్కు కూడా లేకపోవడంతో హైవే ఇసుక రవాణాకు ప్రధాన రహదారిగా మారిపోయింది.

జిల్లా నుంచి వెళ్లే ఇసుక వాహనాలను పైడిభీమవరం ఇసుక చెక్‌పోస్టు వద్ద తప్పనిసరిగా తనిఖీ చేయాలని, అనుమతులు ఉంటేనే విడిచిపెట్టాలని లేదంటే వెంటనే సీజ్‌ చేయాలని రెవెన్యూ, పోలీస్‌ సిబ్బందికి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి 2024 ఆక్టోబర్‌ 6వ తేదీన పైడిభీమవరం ఇసుక చెక్‌పోస్టు పరిశీలనలో ఆదేశించారు. చెక్‌పోస్టు వద్ద ఆ రోజే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి పోలీస్‌, రెవెన్యూ, విజిలెన్సు, మైన్స్‌ సిబ్బందికి ఆర్డీఓ, జేసీల సమక్షంలో పలు సూచనలు చేశారు. కానీ ఆ ఆదేశాల అమలు మూడునాళ్ల ముచ్చటగానే సాగింది.

నకిలీ బిల్లుల ఊసే లేదు

జిల్లా నుంచి నకిలీ బిల్లులతో ఇసుక అక్రమంగా తరలిపోతుందని 2025 ఫిబ్రవరి 14న ఎస్పీ, కలెక్టర్‌ అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆ రోజు పట్టుకున్న 28 ఇసుక లారీల్లో 12 లారీలు నకిలీ బిల్లులేనని క్షేత్రస్థాయిలో గుర్తించారు. ఆపై 12 లారీలు సీజ్‌ చేసి కేసులు నమోదు చేసి లారీలు వదిలేశారు. పట్టుకున్న ఇసుకకు కాపలాగా వీఆర్‌ఏలను నియమించారు. వారు ఆరుమాసాల పాటు కాపు కాశారు. తర్వాత ఆ ఇసుకను వేరే శాఖకు అప్పగించి నిర్మాణాలకు ఉపయోగించారు. ఇసుక అక్రమ రవాణాలో ఓ అధికారి చేతివాటం ఉందని పత్రికల్లో రావటంతో అప్పట్లో ఎంకై ్వరీ చేసినా ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో నీరుగార్చేశారు. ఇంత పగడ్బందీగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న అధికారులు ఏడాది గడవక ముందే చేతులెత్తేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

చెక్‌పోస్టు అలంకార ప్రాయమేనా..?

గత కొన్ని నెలలు పైడిభీమవరం చెక్‌పోస్టులో ఎలాంటి తనిఖీలు జరగడం లేదు. రెవెన్యూ అధికారులు ఉండటం లేదు. సీసీ కెమెరాలు, విద్యుత్‌ దీపాలు, ఇతర వస్తువులకు కాపాలాగా పగటి పూట ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటున్నారు. వారు అలా కాలక్షేపానికి వచ్చి వెళ్లిపోయినట్లు వెళ్తున్నారే తప్ప లారీ ఆపి తనిఖీలు చేయడం లేదు. కనిపిస్తే లారీ నంబర్‌ ఒక నోట్‌ బుక్‌పై రాస్తున్నారు. లేదంటే అదీ లేదు. రాత్రి తనిఖీలు ఉండడం లేదు.

అంతా సక్రమమేనా..?

శ్రీకాకుళం జిల్లా వైపు నుంచి విశాఖపట్నం వైపు రోజు 150కిపైగా ఇసుక భారీ లారీల్లో తరలిపోతోంది. ఇసుక అంతా సక్రమమేనా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. పగటి పూట ఓ పుస్తకంలో ఆ వాహనాల నంబర్లు రాస్తున్నారు. రాత్రిపూటైతే అదీ లేదు. దీనిపై జేఆర్‌పురం సీఐను సంప్రదించగా పైడిభీమవరం ఇసుక చెక్‌పోస్టు వద్ద తమ సిబ్బంది ఉంటున్నారని పేర్కొన్నారు.

సిబ్బంది ఉండడం లేదు

రీ సర్వే పనుల్లో భాగంగా పైడిభీమవరం చెక్‌ పోస్టులో మా సిబ్బంది ఎవరూ ఉండటం లేదు. పోలీస్‌ అధికారులు మాత్రమే ఉంటున్నారు. రెవె న్యూ అధికారులకు ఎలాంటి డ్యూటీలు వేయలేదు.

– సనపల కిరణ్‌ కుమార్‌, తహసీల్దార్‌, రణస్థలం

జాతీయ రహదారిపై ఇష్టానుసారం ఇసుక అక్రమ రవాణా

తనిఖీలు లేకపోవడంతో రెచ్చిపోతున్న ఇసుకాసురులు

అలంకారప్రాయంగా మారిన పైడిభీమవరం ఇసుక చెక్‌ పోస్టు

షిఫ్ట్‌లుగా ఉంటున్నారు

పైడిభీమవరం ఇసుక చెక్‌పోస్టు వద్ద ఉదయం, సాయంత్రం ఒక్కొక్కరుగా పోలీస్‌ సిబ్బంది ఉంటున్నారు. రాత్రి ఎవరూ ఉండడం లేదు. రెవెన్యూ సిబ్బంది గత కొన్ని నెలలుగా రావడం లేదు. ఇసుక లారీ వచ్చే బిల్లులు నకిలీయా లేక ఒరిజినలా అన్నది రెవెన్యూ, విజిలెన్స్‌ వాళ్లకే తెలుస్తుంది.

– ఎస్‌.చిరంజీవి, ఎస్‌ఐ, జేఆర్‌ పురం

హైవే.. తనిఖీలకు నో వే..! 1
1/4

హైవే.. తనిఖీలకు నో వే..!

హైవే.. తనిఖీలకు నో వే..! 2
2/4

హైవే.. తనిఖీలకు నో వే..!

హైవే.. తనిఖీలకు నో వే..! 3
3/4

హైవే.. తనిఖీలకు నో వే..!

హైవే.. తనిఖీలకు నో వే..! 4
4/4

హైవే.. తనిఖీలకు నో వే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement