లెక్కలు చెప్పండి సార్‌..! | - | Sakshi
Sakshi News home page

లెక్కలు చెప్పండి సార్‌..!

Feb 5 2026 7:45 AM | Updated on Feb 5 2026 7:45 AM

లెక్కలు చెప్పండి సార్‌..!

లెక్కలు చెప్పండి సార్‌..!

విరాళాల పర్వం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇటీవల జరిగిన రథసప్తమి వేడుకలకు ప్రభుత్వం పైసా నిధులు కూడా విదల్చకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు దాతలపై భారం వేశారు. అధికారికంగా డొనేషన్లు అడిగారు. ఫండ్స్‌ సేకరణకు ఎనిమిది మంది అధికారులతో ప్రత్యేక కమిటీ వేశారు. వీరికి తోడు ప్రజాప్రతినిధులు నేరుగా ఫోన్లు చేసి, సమావేశాలు నిర్వహించి విరాళాలు సేకరించారు. అసలెంత వచ్చాయి? వచ్చిన దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు? ఇంకా ఎంత మిగిలింది? ఇప్పుడీ వివరాలు వెల్లడిస్తే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వాటిని పారదర్శకంగా వెల్లడించాల్సిన అవసరం అధికారులపై ఉంది. జనం సొమ్ముతో ఘనంగా సంబరాలు నిర్వహించారని, అదే స్ఫూర్తితో ఆ సంబరాలకు సహకరించిన ప్రముఖుల వివరాలు ప్రకటిస్తే అంతా సవ్యంగా జరిగినట్టు అవుతుందనే వాదన వినిపిస్తోంది. గతేడాది సేకరించిన విరాళాలకు సంబంధించి వివరాలు వెల్లడించకపోవడంతో అనేక ఆరోపణలకు తావిచ్చాయి. మరోసారి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

ఏడు రోజులకు పెంచినా..

ఈసారి రథసప్తమి వేడుకలను ఏడు రోజులకు పెంచారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయించారు. ఈసారీ చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. రథసప్తమి వేళ నగరంలో అభివృద్ధి పనులకు మున్సిపల్‌ మంత్రి నారాయణ రూ.2 కోట్లు విడుదల చేసినట్టు ప్రకటించారు. ఆ ప్రకటనపై కూడా హడావుడి చేశారు. ఎమ్మెల్యేను ప్రశంసిస్తూ కథనాలు కూడా రాయించుకున్నారు. కానీ, ఆ రూ.2 కోట్లు విడుదల కాలేదు. ప్రకటనకే పరిమితమైంది. ఇక, సంబరాల కోసమైతే చెప్పనక్కర్లేదు. చిల్లి గవ్వ ఇవ్వలేదు. ఈసారి కూడా జనం సొమ్ముతో చేయాలని నిర్ణయించారు. ఆమేరకు ప్రమఖులతో సమావేశాలు పెట్టారు. ప్రజాప్రతినిధులు నేరుగా ఫోన్‌లు చేసి, పండగకు సహకరించాలని కోరారు. ఒకవిధంగా డొనేషన్ల కోసం ఒత్తిడి కూడా చేశారు. అంతటితో ఆగలేదు. వివిధ రంగాల నుంచి ఫండ్స్‌ సేకరణకు ఎనిమిది మంది అధికారులతో ప్రత్యేక కమిటీ వేశారు. అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వారి పరిధిలో ఉన్న ప్రముఖులు, వర్తకులు, వైద్యులు.. ఇతరత్రా వర్గాల నుంచి నిధులు సేకరించేందుకు తమదైన శైలిలో ప్రయత్నించారు. మొత్తానికి సిక్కోలు దేవుడు పండగ అని అంతా సహకరించారు. సంబరాల కోసం విరాళాలు ఇచ్చారు. తమన్‌ మ్యూజికల్‌ నైట్‌, రథసప్తమి దర్శనాల రోజున నకిలీ పాసుల బాగోతంతో ఇబ్బందులకు గురి చేసినా సంబరాలు మాత్రం బాగానే జరిగాయి. ఇందుకు కారణమైన దాతల వివరాలు మాత్రం నేటికీ వెల్లడించలేదు.

ఒకవేళ దాతలు ఎవరైనా తమ పేర్లు బయటికి చెప్పొద్దని అంటే.. వారి పేర్లు మినహాయించి వెల్లడించాల్సిన అవసరం ఉంది. కనీసం ఎంత వచ్చింది? ఎంత ఖర్చు పెట్టారు? దేనికెంత ఖర్చు అన్నది ప్రకటిస్తే పారదర్శకం అవుతుంది. ఎందుకంటే, ఎవరి స్థాయిలో వారు విరాళాల సేకరణకు కృషి చేశారు. ఎవరి ద్వారా ఎంత వచ్చింది? మన దగ్గర ఏదైనా పండగ చేయాలంటే దాతలు ఏ స్థాయిలో ముందుకొస్తారో? భవిష్యత్‌లో ఒక అంచనాకు రావడానికి దోహదపడుతుంది. అంతేకాదు ఎటువంటి అపోహాలకు, అనుమానాలకు, ఆరోపణలకు తావివ్వకుండా ఉంటుంది.

రథసప్తమి వేడుకలకు భారీగా ఫండ్‌ సేకరణ

జనం సొమ్ముతో సంబరాల నిర్వహణ

అధికారికంగానే నిధులు సేకరణ

ఎవరెంత ఇచ్చారో వెల్లడిస్తేనే పారదర్శకత

గతేడాది నిధులకూ నేటికీ లెక్క చెప్పని వైనం

పైసా విదల్చని ప్రభుత్వం..

గతేడాది రఽథసప్తమి వేడుకలను రాష్ట్ర పండగగా ప్రభుత్వం ప్రకటించింది. మూడు రోజుల పండగను ఆర్భాటంగా చేసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయలేదు. నగరంలో జరిగిన పనులు సైతం కార్పొరేషన్‌, సుడా నిధులతో కానిచ్చేశారు. వాటికింత వరకు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆ పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగలేదు. వారంతా ఏడాదికి పైగా బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు. గత ఏడాది మూడు రోజుల సంబరాలన్నీ దాతల సొమ్ముతోనే జరిగాయి. వారిచ్చిన విరాళాలతోనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఖర్చు దాతలదే. వారి సొమ్ముతో సంబరాలు చేసి శభాష్‌ అన్పించుకున్న అధికారులు, పాలకులు.. దాతలు, ఖర్చు వివరాలు అధికారికంగా ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement