బిల్లు బాదుడు తప్పదా! | - | Sakshi
Sakshi News home page

బిల్లు బాదుడు తప్పదా!

Feb 5 2026 7:45 AM | Updated on Feb 5 2026 7:45 AM

బిల్లు బాదుడు తప్పదా!

బిల్లు బాదుడు తప్పదా!

● ఐదు రోజులుగా సమ్మెలో విద్యుత్‌ మీటర్ల రీడర్లు

● స్లాబ్‌ పెరిగి బిల్లులు

అధికమయ్యే

అవకాశాలు

● తీవ్ర ఆందోళనలో

వినియోగదారులు

అరసవల్లి : కూటమి ప్రభు త్వం వచ్చాక ఇప్పటికే మూడు సార్లు విద్యుత్‌ చార్జీలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులకు గురైన సామాన్యులు.. తాజాగా మరో బాదుడు తప్పదనే సంకేతాలతో ఆందోళనకు గురవుతున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్‌ మీటర్‌ రీడర్లు ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వారు సకాలంలో రీడింగ్‌ తీయకపోవడంతో స్లాబ్‌ పెరిగితే.. యూనిట్‌ చార్జీలు పెరుగుతాయని వినియోగదారులు ఆందోళనలో ఉన్నారు.

పెనుభారం..

వాస్తవానికి ప్రతి నెలా 2 నుంచి 10వ తేదీలోగా గృహ విద్యుత్‌మీటర్ల వినియోగ రీడింగ్‌ను తీయాల్సి ఉంది. నేటికి ఐదు రోజులుగా రీడింగ్‌కు ఎవ్వరూ రాకపోవడంతో విద్యుత్‌ వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ప్రతి నెలా 10లోగా మీటర్‌ రీడింగ్‌ తీస్తే అప్పుడున్న వినియోగం బట్టి యూనిట్‌ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 0–50 యూనిట్లు లోపు వినియోగానికి యూనిట్‌కు రూ.1.50, అదే 50–75 యూనిట్ల లోపు అయితే రూ.3 చొప్పున, 76–125 యూనిట్ల లోపు ఉంటే రూ.4.50 వరకు చార్జీ చేస్తారు. అదే 126–225 యూనిట్లు ఉంటే రూ.6 వరకు చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా రీడర్ల సమ్మెతో రీడింగ్‌ ఆలస్యమైతే..స్లాబ్‌కు మించి ఒక యూనిట్‌ దాటినా భారీగా విద్యుత్‌ బిల్లులు వచ్చే అవకాశాలున్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ పరిస్థితి

జిల్లాలో విద్యుత్‌ శాఖలో మొత్తం 6 లక్షల వరకు గృహ విద్యుత్‌ కనెక్షన్లున్నాయి. ప్రతి నెల వీటి నుంచి సుమారుగా రూ.32 కోట్ల నుంచి రూ.35 కోట్లు వరకు డిమాండ్‌ ప్రకారం బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్లలో ఈమేరకు విద్యుత్‌ మీటర్ల రీడర్లు 207 మంది ఉన్నారు. రీడింగ్‌ మిషన్లు ఛార్జీలు, ఫోన్‌ రీఛార్జ్‌, రీడింగ్‌ పేపర్‌ రోల్స్‌, మరమ్మతులు, ఈఎస్‌ఈ, ఈపీఎఫ్‌ మినహాయింపులు పోగా ఒక్కో రీడర్‌కు ఒక్కో మీటర్‌ నుంచి రూ.3.10 మాత్రమే అందుతుంది. సగటున ఒక రీడర్‌ నెలకు 3 వేల మీటర్లను రీడింగ్‌ చేస్తే నెలకు ఆదాయం రూ.10 వేల లోపే వస్తుంది.

డిమాండ్లు ఇవే..

స్మార్ట్‌మీటర్లు తీసుకొచ్చిన తరుణంలో మీటర్‌ రీడర్లకు విద్యుత్‌ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. రీడర్ల విద్యార్హతల బట్టి విద్యుత్‌ శాఖలో టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ షిఫ్ట్‌ ఆపరేటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, వాచ్‌మేన్లు, అటెండర్లు వంటి పోస్టుల్లో నియమించాలి. ఎస్‌క్రో ఖాతా తెరిపిస్తామన్న హామీ నెరవేర్చాలి.

సమస్యలు పరిష్కరించాల్సిందే..

రాష్ట్ర సంఘం పిలుపుమేరకు మీటర్ల రీడర్ల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సమ్మె చేస్తున్నాం. హామీలను నెరవేర్చి ప్రత్యామ్నయ ఉపాధి కల్పించేవరకు పోరాడతాం.

– మామిడి బాలకృష్ణ,

జిల్లా విద్యుత్‌ మీటర్ల రీడర్ల సంఘం ప్రతినిధి

ప్రత్యామ్నాయం అమలు చేస్తున్నాం...

రీడర్లు సమ్మెలో ఉండడంతో సదరు క్రాంట్రాక్టర్లు నుంచి 160 స్కానర్లు, 160 ప్రింటర్లు అందుబాటులోకి తీసుకున్నాం. 250 మందికి పైగా లైన్‌మేన్లు, లైన్‌ ఇన్‌స్పెక్టర్లు, జేఎల్‌ఎంల సహాయంతో ఇంటింటి వినియోగ బిల్లుల రీడింగ్‌ను సకాలంలో తీయించేలా చర్యలు చేపడుతున్నాం.

– నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement