జిల్లా ఓటర్ల సంఖ్య 18,92,149
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 18,92,149 మంది ఉన్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబి తా, ఈవీఎంల పరిశీలనపై సమావేశం నిర్వహించారు. ఓటర్లలో పురుషులు 9,37,191 మంది కాగా, మహిళా ఓటర్లు 9,54,848 మంది ఉన్నారని వివరించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో అత్యధికంగా 2,75,568 మంది ఓటర్లు ఉండగా, ఆమదాలవలసలో అత్యల్పంగా 1,94,209 మంది ఓటర్లు ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,358 పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గత జనవరి 6 నుంచి ఈ డిసెంబర్ 30 వరకు ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు కోసం 37,586 దరఖాస్తులు అందాయని, వాటిలో 29,795 దరఖాస్తులను ఆమోదించామని కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఈవీఎంలు అత్యంత భద్రంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే తనిఖీల్లో భాగంగా గోదాము సీళ్లను తెరిచి యంత్రాలను పరిశీలించారు. అనంతరం తనిఖీ పుస్తకంలో కలెక్టర్‌తో పాటు ప్రతినిధులు సంతకాలు చేశారు.


