ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం
● రైతులను దోచుకుంటున్నారు
● మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
ఆమదాలవలస: ధాన్యం కొనుగోలు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని, రైతులు దగా పడుతున్నారని మాజీ స్పీకర్, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గురువారం ఆమదాలవలసలోని తన స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం స్పష్టమైన విధానాలు రూపొందించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రైతు లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దీని వల్ల మధ్యవర్తులు, దళారులు రాజ్యమేలుతున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. బరువు కోతలు, తేమ పేరుతో జరుగుతున్న మోసాలను ప్రభుత్వం మౌనంగా చూస్తోందని మండిపడ్డారు. సొసైటీల నుంచి మిల్లుల వరకు అన్ని దశల్లో రైతులకు న్యాయం జరగడం లేదని, పంట నాణ్యత ఎంత బాగున్నా ధరలో అయాచిత కోతలు విధించడం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. వ్యవసాయం దండగ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల కు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తి రస్కరిస్తే, రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు.
ఫిర్యాదు చేసినా..
జిల్లాలో కొనుగోలు వ్యవస్థ మొత్తం అవినీతిమయమైందని, మిల్లర్లు, సంబంధిత అధికారులు, మిల్లర్ల యూనియన్ ప్రతినిధులు కలసి రైతులను బహిరంగంగా దోచుకుంటున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు రైతుల నుంచి 3 నుంచి 5 కిలోల వరకు అదనంగా తీసుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నా సివిల్ సప్లై శాఖ చేతులు ముడుచుకుందన్నారు. ఒక్కో బియ్యం లారీపై సివిల్ సప్లై అధికారులు రూ.2500లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడం చాలా బాధాకరమని, ఈ డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్లాయో నిగ్గు తేల్చాలని కోరారు. జిల్లాలోని గోడౌన్లు అన్నీ ఏఎస్ డబ్ల్యూసీ ద్వా రా అద్దెకు తీసుకున్నప్పటికీ, నిర్వహణ బాధ్యత పూర్తిగా ఓనర్లకే అప్పగించడం, వారు ఒక్కో బియ్యం లారీపై రూ.400లు వసూలు చేయడం వ్యవస్థలో అక్రమాలు ఎంత లోతుగా ఉన్నాయో చెబుతున్నాయని పేర్కొన్నా రు. మిల్లులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులపై 10 శాతం పన్ను ముసుగులో మంత్రి అచ్చెన్నాయుడు సోదరులు, వారి అనుచరులు, అసోసియేషన్ పేరుతో రూ. 8 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జేసీ స్థాయిలో కూడా సమస్యలను నిదానంగా తీసుకోవడం వల్లే అవినీతి పెచ్చుమీరుతోందన్నారు. జిల్లాలో ఇప్పటికే 30 గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు అవినీతి, అధిక భారం, లైసెన్స్ సమస్యలతో మూతపడే స్థితిలో ఉన్నాయని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే రైస్ మిల్లులు మూసుకునే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు.
బాబాయి, అబ్బాయిలపై మండిపాటు
జిల్లా వ్యవహారాలు పూర్తిగా జిల్లాకు చెందిన మంత్రి ఆధీనంలో నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. జిల్లాలో బాబాయి కుమ్మేస్తే, దేశంలో అన్ని ఎయిర్‌పోర్టులకు తాళాలు వేసి అబ్బాయి అధికారం చెలాయిస్తున్నారని తమ్మినేని ఎండగట్టారు. స్థానిక పరిపాలన నుంచి కేంద్ర స్థాయి వరకు ఒకే కుటుంబం అధికారాన్ని తమ మనుగడకు వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో యువ నాయకుడు తమ్మినేని చిరంజీవినాగ్ పాల్గొన్నారు.


