ఆదిత్యా నమోస్తుతే..
అరసవల్లి : అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో మార్గశిర ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. అంతరాలయంలో భక్తుల గోత్రనామాలతో పూజలు చేసేలా ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ తగు చర్యలు చేపట్టారు. వివిధ దర్శనాల రూపంలో రూ.4,55,800, విరాళాల రూపంలో రూ.64,700, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.2.47 లక్షల మేరకు ఆదాయం లభించినట్టు ఈవో వివరించారు. కాగా భక్తుల సమాచారం కోసం ఏర్పాటుచేసిన సమాచార కేంద్రం నిర్వహణ తీరుపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. భక్తులతో దురుసుగా ప్రవర్తించిన కారణంగా సంబంధిత సిబ్బందిపై ఆలయ ఈవోకు ఫిర్యాదులు అందాయి.
ఉమ్మడి హక్కుల సాధనకు కృషి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని రెవెన్యూ సర్వీసుల సంఘం, రెవెన్యూ ఉద్యోగులందరూ వారి ప్రత్యేకతను కనబర్చుతూ మిగిలిన జిల్లా లకు ఆదర్శంగా నిలిచారని ఆంధ్రప్రదేశ్ రెవె న్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపి జేఏసి అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఇదే పంథాను అనుసరిస్తూ భవిష్యత్‌లో విధి నిర్వహణలో ఐకమత్యాన్ని చూపుతూ ప్రజలకు చేరువవుతూ రెవెన్యూ శాఖ ఔన్నత్యాన్ని పెంచి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని కోరారు. శ్రీకాకుళం నగరంలో రెవెన్యూ అతిథి గృహ సమావేశ మందిరంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమం చేయడం ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన లక్ష్యం కాదని, సమస్యల పరిష్కారం ప్రధాన ధ్యేయమని అన్నారు. రానున్న 2026 ఫిబ్రవరి 5వ తేదీన రాష్ట్ర ఏపీ జేఏసీ అమరావతి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపి.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.
ఆదిత్యా నమోస్తుతే..


