
11, 12 తేదీల్లో కళా ఉత్సవం
గార : వమరవల్లి డైట్ కళాశాలలో సెప్టెంబర్ 11, 12 తేదీల్లో జరగనున్న జిల్లా స్థాయి కళా ఉత్సవం పోటీలను విజయవంతం చేయాలని ఇన్‌చార్జి డీఈఓ రవిబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం డైట్‌లో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలను వెలికి తీయడమే లక్ష్యంగా పోటీలు జరుగుతున్నాయని చెప్పారు. గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, నృత్యం, నాటకం, సంప్రదాయ కథలు, దృశ్యకళలు వంటి ఆరు అంశాలపై పోటీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన 9, 10, 11, 12 తరగతులకు చెందిన వారు పాల్గొనవచ్చని, ఆసక్తి కలవారు సెప్టెంబర్ 4లోగా 77023 91639 నంబరుకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.గౌరిశంకర్, డీవైఈఓ విజయకుమారి, లెక్చరర్లు వెంకటరావు, సీహెచ్ రమణ తదితరులు పాల్గొన్నారు.