దీర్ఘాశిలో చైన్‌స్నాచింగ్‌ | - | Sakshi
Sakshi News home page

దీర్ఘాశిలో చైన్‌స్నాచింగ్‌

Aug 30 2025 8:56 AM | Updated on Aug 30 2025 10:37 AM

పోలాకి: దీర్ఘాశి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో దొంగలు హల్‌చల్‌ సృష్టించారు. మెండ గడ్డెమ్మ(63) అనే వృద్ధురాలు పశువులకు దాణా పెడుతుండగా వెనక నుంచి వచ్చిన అగంతకుడు బంగారు తాడు (సుమారు పావు తక్కువ మూడు తులాలు) లాక్కొని అక్కడే బైక్‌పై ఉన్న ఇంకో వ్యక్తి సహాయంతో పరారయ్యారు. తాడు లాగే సమయంలో తన నోటిని గట్టిగా మూసివేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఎస్‌ఐ రంజిత్‌ నేతృత్వంలో చైన్‌స్నాచర్స్‌ కోసం వేట ముమ్మరం చేశారు. కొందరు అనుమానితులను గుర్తించి విచారిస్తున్నట్లు సమాచారం. నిత్యం రద్దీగా వుండే పోలాకి–నరసన్నపేట రహదారిలో చైన్‌స్నాచర్‌లు పరారైనట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

కార్మికులకు అండగా..

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): శ్రమదోపిడీకి గురవుతున్న కార్మికులకు కార్మికశాఖ ఉప కార్మిక కమిషనర్‌ డి.దినేష్‌కుమార్‌ అండగా నిలిచారు. ప్రత్యేక తనిఖీలు నిర్వహించి శుక్రవారం కార్మికులకు రూ.45514 వేతనాన్ని యాజమాన్యాల నుంచి వసూలు చేసి డి.డి.రూపంలో తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా డీసీఎల్‌ మాట్లాడుతూ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ప్రకారం ఆన్‌లైన్‌లో తనిఖీ నిర్వహించాలని వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించగా.. అందులో నలుగురు కార్మికుల వేతనాల్లో తేడాల్ని గమనించామన్నారు. సంబంధిత యజమానుల వద్ద నుంచి తేడా వేతనాన్ని రికవరీ చేసి కార్మికులకు అందించామని చెప్పారు. దీంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.

చెరువులో పడి వ్యక్తి మృతి

టెక్కలి రూరల్‌: పెద్దరోకళ్లపల్లి పంచాయతీ రామనగరం గ్రామానికి చెందిన బొడ్డు రామన్న (37) అనే వ్యక్తి చెరువులో పడి మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్న తన పొలంలో ఎరువులు వేసిన తర్వాత గ్రామ సమీపంలోని చెరువులో స్నానానికి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో మునిగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత స్థానికులు గుర్తించి చెరువులో తేలుతున్న రామన్నను బయటకు తీసి టెక్కలి జిల్లాఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. రామన్నకు భార్య లత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశారు.

మా సొమ్ము ఎప్పుడు చెల్లిస్తారు?

ఇచ్ఛాపురం: తాము కష్టపడి సంపాదించుకున్న సొమ్మును తిరిగి చెల్లించాలని, లేనిపక్షంలో ఆందోళన తప్పదని ఇచ్ఛాపురం పోస్టాఫీసు వద్ద ఖాతాదారులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం పోస్టాఫీసును పరిశీలించేందుకు వ చ్చిన పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌ను కలిసి తమ గోడు వినిపించారు. స్కామ్‌ జరిగి నెలరోజులైనా పోస్టల్‌ సిబ్బంది పట్టించుకోకపోవడం తగదని ఖాతాదారులు బాలరాజు, సీహెచ్‌ లోహిదాస్‌, శ్రీను తదితరులు వాపోయారు.

యువకుడిపై పోక్సో కేసు

శ్రీకాకుళం క్రైమ్‌ : బాలికను మోసగించిన యువకుడిపై శుక్రవారం పోక్సో కేసు నమోదు చేశామని శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ సీఐ పి.ఈశ్వరరావు తెలిపారు. కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని విద్యాధరిపురం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ కుమార్తె ఇంటర్మీడియట్‌ సగంలో ఆపేసింది. శ్రీకాకుళం నగరంలోని బాకెర్‌సాహెబ్‌పేటలో తన అమ్మమ్మ ఇంటికి తరచూ వస్తుండేది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో నగరానికి వచ్చిన బాలిక తన ఫోన్‌ పనిచేయకపోవడంతో దీపామహాల్‌ సమీపంలో సెల్‌ఫోన్‌ షాపులో ఇచ్చింది. నిర్వాహకుడు వడ్డి శ్యామ్‌సుందరరావుతో పరిచయం ఏర్పడటంతో గర్భం దాల్చింది. దీంతో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.

దీర్ఘాశిలో చైన్‌స్నాచింగ్‌  1
1/1

దీర్ఘాశిలో చైన్‌స్నాచింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement